కొనసాగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) సదస్సు.. నేడు చర్చకు రానున్న పలు సాంకేతిక విషయాలు
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) సదస్సు మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది నేడు, రేపు కొనసాగనుంది.

India Mobile Congress 2020: ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) సదస్సు మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది నేడు, రేపు కొనసాగనుంది. ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇంక్లూసివిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడం వంటి ఆంశాలపైనే ఐఎంసీ-2020లో చర్చలు కొనసాగుుతన్నాయి. విదేశీ, స్థానిక పెట్టుబడులను ప్రోత్సహించడానికి, టెలికాం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లోని ఆర్‌డీని ప్రోత్సహించేందుకు ఆర్‌అండ్‌డీని పోత్సహించడమే లక్ష్యంగా ఈ సదస్సు కొనసాగుతోంది. కోవిడ్ కారణంగా ఈ సమావేశాన్ని తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. వివిధ మంత్రిత్వశాఖలు, టెలికాం సీఈఓలు, గ్లోబల్ కంపెనీల సీఈఓలు, 5జీ డొమైన్ నిపుణులు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా విశ్లేషకులు, క్లౌడ్, ఎడ్జ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ నగరాలు, ఆటోమేషన్‌లో డొమైన్ నిపుణులంతా సదస్సులో పాల్గొని పలు సలహాలు ఇస్తున్నారు. ఇక ఈ సదస్సులో మంగళవారం పలు విషయాలు ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ అంశాలపై మాట్లాడారు. వాటన్నింటినీ ఓసారి క్లుప్తంగా చూద్దాం..
“5జీ మొబైల్ నెట్‌వర్క్‌ను సత్వరం అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం అంతా సమిష్టిగా కృషి చేయాలని అవసరం ఉంది. కోట్ల మందికి కోట్ల కొద్దీ రూపాయల ప్రయోజనాలను చేకూర్చేందుకు మొబైల్ టెక్నాలజీ తోడ్పడుతోంది. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ఉపయోగపడుతోంది. దీని తోడ్పాటుతోనే ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో కోవిడ్–19 టీకాలను వేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. టెలికం పరికరాలు, డిజైన్, అభివృద్ధి, తయారీకి భారత్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అంతా కలిసి పని చేయాలి. మొబైల్స్ తయారీకి కీలకమైన దేశాల్లో ఒకటిగా భారత్ ఎదుగుతోంది.” అని ప్రధాని చెప్పారు. మొత్తానికి టీకాలు వేయడానికి కూడా మొబైల్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. ఇక ఈ రోజు కొనసాగే సదస్సులో కూడా ఎన్నో విషయాలు ప్రస్తావనకు రానున్నాయి.
