వచ్చారో.. అరెస్టే..! నెతన్యాహుకు హంగేరి ప్రధాని పీటర్ మాగ్యార్ స్ట్రాంగ్ వార్నింగ్
హంగేరి రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ 16 ఏళ్ల సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ, పీటర్ మాగ్యార్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే ఆయన అంతర్జాతీయ వేదికపై సంచలన నిర్ణయాలు ప్రకటిస్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి మాగ్యార్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

హంగేరి రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ 16 ఏళ్ల సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ, పీటర్ మాగ్యార్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే ఆయన అంతర్జాతీయ వేదికపై సంచలన నిర్ణయాలు ప్రకటిస్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి మాగ్యార్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. నెతన్యాహు హంగేరిలో అడుగుపెడితే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని మాగ్యార్ స్పష్టం చేశారు. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాల ఆరోపణలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఇప్పటికే నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేయడమే దీనికి ప్రధాన కారణం.
గత విక్టర్ ఓర్బన్ ప్రభుత్వం ఐసీసీ నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం 2026 జూన్ 2 నుండి అమలులోకి రావాల్సి ఉండగా, మాగ్యార్ ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు. హంగేరి ఐసీసీలో సభ్యదేశంగానే కొనసాగుతుందని, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉంటుందని ఆయన ప్రకటించారు. స్కై న్యూస్ కథనం ప్రకారం, ఐసీసీ వారెంట్ ఎదుర్కొంటున్న ఎవరైనా హంగేరి సరిహద్దులు దాటితే వారిని నిర్బంధిస్తామని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, 1956 హంగేరియన్ తిరుగుబాటు 70వ వార్షికోత్సవానికి మాగ్యార్ పలు దేశాల నాయకులతో పాటు నెతన్యాహును కూడా ఆహ్వానించారు. అయితే, ఈ ఆహ్వానంతో పాటు ఒక కీలక షరతును కూడా ఆయన ముందే తెలియజేశారు. ఐసీసీ నిబంధనల విషయంలో హంగేరి వెనక్కి తగ్గదని, చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని నెతన్యాహుకు స్పష్టం చేసినట్లు మాగ్యార్ పేర్కొన్నారు.
ఏప్రిల్ ఎన్నికల్లో అవినీతి, ఆరోగ్య సంరక్షణ, ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండాగా మాగ్యార్ విజయం సాధించారు. యూరోపియన్ యూనియన్ (EU), నాటో (NATO)లతో సంబంధాలను తిరిగి బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రముఖ దేశాధినేతలపై చర్యలు తీసుకోవాల్సి వచ్చినా సరే, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు హంగేరి కట్టుబడి ఉంటుందని మాగ్యార్ చర్యలు నిరూపిస్తున్నాయి. ఈ పరిణామం హంగేరి విదేశాంగ విధానంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
