AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదేళ్ల బంధం.. పగబట్టిన అనుమానం.. కన్నతల్లి కాటికి.. తండ్రి జైలుకు.. అనాథలైన బిడ్డలు!

అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పదేళ్ల బంధం, ఇద్దరు పసిపిల్లల భవిష్యత్తు.. అంతా ఒక్క క్షణికావేశంలో బూడిదయ్యాయి. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో జరిగిన ఈ విషాద ఘటన మనుషుల మధ్య నమ్మకం ఎంత బలహీనపడిందో చెప్పకనే చెబుతోంది.తమ కాపురం సజావుగా సాగాలని కలలు కనే ఏ భార్యాభర్తలకైనా అన్యోన్యత పునాది. కానీ, వాల్మీకిపురానికి చెందిన జగదీష్, మౌనికల విషయంలో అది సాధ్యపడలేదు.

పదేళ్ల బంధం.. పగబట్టిన అనుమానం.. కన్నతల్లి కాటికి.. తండ్రి జైలుకు.. అనాథలైన బిడ్డలు!
Husband Kills Wife
Raju M P R
| Edited By: |

Updated on: Apr 21, 2026 | 11:28 AM

Share

అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పదేళ్ల బంధం, ఇద్దరు పసిపిల్లల భవిష్యత్తు.. అంతా ఒక్క క్షణికావేశంలో బూడిదయ్యాయి. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో జరిగిన ఈ విషాద ఘటన మనుషుల మధ్య నమ్మకం ఎంత బలహీనపడిందో చెప్పకనే చెబుతోంది.తమ కాపురం సజావుగా సాగాలని కలలు కనే ఏ భార్యాభర్తలకైనా అన్యోన్యత పునాది. కానీ, వాల్మీకిపురానికి చెందిన జగదీష్, మౌనికల విషయంలో అది సాధ్యపడలేదు. 2016లో వివాహమైన నాటి నుంచే జగదీష్ మనసులో అనుమానం బీజం పడింది. చదువు మధ్యలో ఆపేసినా మౌనిక తన సంసారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నించింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా జగదీష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. కట్ చేస్తే, ఆ దంపతుల మధ్య గొడవలతో భార్యను హత్య చేసి పోలీసుల ముందు భర్త లొంగిపోవడంతో ఇద్దరు బిడ్డలను అనాథలుగా మారిపోయారు.

అన్నమయ్య జిల్లా వాల్మీకి పురంలో భర్త అనుమానం భార్య ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలతో భార్య హత్యకు గురి కాగా భర్త జైలు పాలు కాగా ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తంబళ్లపల్లి మండలం బురజుపల్లికి చెందిన డిగ్రీ చేస్తూ చదువు మానేసిన మౌనికకు వాల్మీకిపురంకు చెందిన జగదీష్ తో 2016 లో పెళ్లయింది. 10 ఏళ్ల కాపురానికి కౌశిక్(9), లోక్షిత(6) ఇద్దరు పిల్లలు ఉండగా వాల్మీకిపురం బస్టాండ్ వద్ద టీ స్టాల్ నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఇద్దరి మధ్య పెళ్లైన నాటి నుంచి ఉన్న గొడవలే కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వాల్మీకిపురంను వదిలి బెంగుళూరు వెళ్లిపోయారు. యలహంకలో ఉన్న మౌనిక తండ్రి వద్దకు ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. అక్కడ మౌనిక తండ్రి కూరగాయలు వ్యాపారం చేస్తుండగా, అదే వ్యాపారం చేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు దంపతులు. ఈ క్రమంలోనే మౌనిక – జగదీష్‌ల మధ్య గొడవలు మాత్రం తగ్గలేదు. అల్లుడు జగదీష్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన మౌనిక తండ్రి సుధాకర్ తమ పరువు పోతుందని వెళ్లిపోమన్నాడు. దీంతో ఏప్రిల్ 19వ తేదీన యలహంక నుంచి తిరిగి వాల్మీకిపురం చేరుకున్న ఆ జంటకు అది ఆఖరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు.

సొంతూరికి వచ్చిన కొద్ది గంటలకే పాత గొడవలు మళ్లీ మొదలయ్యాయి. సాయంత్రం 4:30 గంటల సమయంలో మాట మాట పెరిగి, కోపంతో ఊగిపోయిన జగదీష్, మౌనిక మెడలోని చున్నీతోనే ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. కట్టుకున్న భార్యను నిర్జీవంగా మార్చాక, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మౌనికను హత్య చేసిన విషయం స్థానికుల నుంచి సమాచారం అందడంతో వాల్మీకిపురంకు వచ్చిన మౌలిక తల్లి ఇంట్లో విగత జీవిగా భోరున విలపించింది. అల్లుడిని అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరింది.

“అనుమానం గొంతు నులిమింది” అన్న మాట ఇక్కడ అక్షరాలా నిజమైంది. క్షణికావేశం, అపోహలు ఒక కుటుంబాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే సాక్ష్యం. మౌనిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది కానీ, ఆ పిల్లలకి పోయిన అమ్మను, ఉన్నా లేని నాన్నను ఎవరు తిరిగి ఇవ్వగలరు?

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us