ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరాల్లో ఒకటైన కుటుపలాంగ్‌లోని క్యాంప్ నంబర్ 11 దగ్గర ఆదివారం (మార్చి 5) మంటలు చెలరేగాయి. వెదురు, టార్పాలిన్ షెల్టర్స్ కావడంతో క్షణాల్లోనే పక్కనున్న షెల్టర్స్‌నూ చుట్టుముట్టేశాయి. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో.. భయాందోళనకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. దాదాపు 2 వేల షెల్టర్లు అగ్నికి ఆహుతయ్యాయి. 12 వేల మంది నిరాశ్రయలయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. 2017లో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో సైనిక దాడి నుంచి పారిపోయి వచ్చిన వీరంతా బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందారు. ఇప్పుడు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఐతే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు రోహింగ్యా శిబిరాల్లో 222 అగ్నిప్రమాదాలు జరిగాయి. 2021మార్చిలో పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో 15 మంది సజీవదహనమయ్యారు. 50 వేలమంది నిరాశ్రయులయ్యారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.