గత ఇరవై నెలలుగా జర్మనీ ప్రభుత్వ అధీనంలో ఉన్న భారత సంతతి బాలిక అరిహా షా ను వీలైనంత త్వరగా స్వదేశానికి పంపాలని కేంద్రం శుక్రవారం జర్మనీని కోరింది. ఈ విషయంలో జర్మనీపై వివిధ దౌత్య మార్గాల్లో ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
అరిహా షాను ఆమె తల్లిదండ్రులు వేధించారన్న ఆరోపణలపై జర్మనీ బాలల సంరక్షణ అధికారులు 2021 సెప్టెంబర్ 23న పాపను తమ అధీనంలోకి తీసుకున్నారు. నాటి నుంచి చిన్నారి ప్రభుత్వ సంరక్షణలోనే ఉంటోంది. బాలికను ఎలా వెనక్కుతెచ్చుకోవాలో తెలీక ఆమె తల్లిదండ్రులు భవేష్ షా, ధారా షా ఆవేదనలో మునిగిపోయారు. కాగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ ఈ విషయమై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇంతకాలం పాటు బాలికను మరోదేశంలో ఉంచడమంటే ఆమెకున్న సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైన హక్కులను ఉల్లఘించడమేనని బాలిక తల్లిదండ్రులు, భారత ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు.
ముంబైకి చెందిన భవేష్ షా, ధారా షా దంపతులు 2018లో జర్మనీకి వెళ్లారు. అక్కడ వారికి అరిహా షా జన్మించింది. ఓ రోజు పాప ఆడుకుంటుండగా కింద పడిపోవడంతో ఆమె మర్మావయవం వద్ద గాయమైంది. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయం తీరునుబట్టి చిన్నారిపై లైంగిక దాడి జరిగి ఉంటుందని అనుమానించిన జర్మనీ బాలల సంరక్షణ అధికారులు పాపను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, మరో రెండు నెలల్లో భవేశ్ షా దంపతుల వీసా గడువు ముగియనుంది. దీంతో, పాప లేకుండా భారత్‌కు తిరిగిరావాల్సి వస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..