F-35 Stealth Fighters: భారత వైమానిక దళంలో బ్రహ్మాస్త్రం.. F-35 ఫైటర్ జెట్స్‌తో మరింత బలోపేతం!
గగనతలం నుంచి సాగించే యుద్ధాల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో పాటు శత్రువుకు అత్యధిక నష్టాన్ని కలగజేయడం కోసం F-35 యుద్ధ విమానాలను రూపొందించారు. సింగిల్-సీట్, సింగిల్-ఇంజిన్‌తో కూడిన ఈ ఫైటర్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయగల్గిన మల్టీరోల్ యుద్ధ విమానం.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించి చర్చనీయాంశంగా మార్చింది ఒకే ఒక్క అంశం. అది ప్రపంచంలోని అగ్రశ్రేణి స్టెల్త్ ఫైటర్ జెట్లలో ఒకటైన లాక్‌హీడ్ మార్టిన్ F-35 లైటెనింగ్-II రకం యుద్ధ విమానాలను భారత్‌కు అందించేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన. ఓవైపు స్వయంగా ఫైటర్ జెట్లను తయారు చేసుకుంటూ స్వయం సమృద్ధి సాధించేందుకు భారతదేశం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ప్రపంచంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాలు ఇప్పటికే యుద్ధ విమానాల తయారీలో ఎంతో ముందుకు దూసుకెళ్లిపోయాయి.
రక్షణ రంగంలో అగ్రరాజ్యాల సరసన నిలవాలన్నా.. విస్తరణ కాంక్షతో సరిహద్దులు మార్చేస్తున్న చైనా దూకుడుకు కళ్లెం వేయాలన్నా.. భారతదేశం తన వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భారత్‌కు మొదటి నుంచి మిత్రదేశం రష్యా మిగ్, సుఖోయ్ రకం యుద్ధ విమానాలను అందజేస్తూ వస్తుండగా.. ఫ్రాన్స్ నుంచి మిరాజ్, రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేస్తూ వచ్చింది. భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 542 వివిధ రకాల యుద్ధ విమానాలు ఉండగా.. భారత్‌తో పోల్చుకుంటే చిన్న దేశమైనప్పటికీ.. సరిహద్దుల్లో నిత్యం సమస్యలు సృష్టిస్తున్న పాకిస్తాన్ 498 యుద్ధ విమానాలను కలిగి ఉంది.
ఇక పాకిస్తాన్ తరహాలో శత్రుదేశం కానప్పటికీ.. సమస్యాత్మకంగా మారిన చైనా దగ్గర ఏకంగా 2,184 యుద్ధ విమానాలున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జన సంఖ్య కలిగిన భారత్.. పొరుగున సమస్యాత్మకంగా ఉన్న ఈ రెండు దేశాలతో తలపడాలంటే వైమానిక దళ సామర్థ్యాన్ని శరవేగంగా పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఈ దశలో అమెరికా అధునాత Lockheed Martin F-35 Lightning II రకం యుద్ధ విమానాలను అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం ప్రపంచవ్యాప్తంగా కీలక పరిణామంగా మారింది. ముఖ్యంగా భారత పొరుగు దేశాల్లో గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది.
ఇప్పటికే బెంగళూరులో జరుగుతున్న ఎయిరో ఇండియా షోలో ఇప్పటికే F-35 ఫైటర్ జెట్లు పాల్గొనగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ “ఈ సంవత్సరం నుంచి మేము భారతదేశానికి సైనిక, రక్షణ అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాము. చివరికి భారతదేశానికి F-35 స్టెల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నాము” అన్నారు. వీటితో దాదాపు సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగిన రష్యన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు సుఖోయ్ (Su-57) యుద్ధ విమానాలను భారత్‌కు అందించేందుకు రష్యా ఆసక్తిని వ్యక్తం చేయగా.. ఇప్పుడు అమెరికా ముందుకొచ్చి F-35 జెట్లను ఆఫర్ చేసింది.
లాక్‌హీడ్ మార్టిన్ F-35 లైట్నింగ్ II
గగనతలం నుంచి సాగించే యుద్ధాల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో పాటు శత్రువుకు అత్యధిక నష్టాన్ని కలగజేయడం కోసం F-35 యుద్ధ విమానాలను రూపొందించారు. సింగిల్-సీట్, సింగిల్-ఇంజిన్‌తో కూడిన ఈ ఫైటర్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయగల్గిన మల్టీరోల్ యుద్ధ విమానం. ఇది ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, ఇంటెలిజెన్స్, నిఘా సామర్థ్యాలను కూడా కలిగి ఉంది. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థతో నార్త్రోప్ గ్రుమ్మన్, BAE సిస్టమ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ విమానాన్ని అభివృద్ధి చేశాయి. ఇందులో 3 సబ్-వేరియంట్స్ ఉన్నాయి. సాధారణ యుద్ధ విమానాల మాదిరిగా టేకాఫ్, ల్యాండింగ్ (CTOL) సదుపాయం కలిగిన వాటిని F-35A గా, షార్ట్ టేకాఫ్, వర్టికల్-ల్యాండింగ్ (STOVL) సదుపాయాలు కల్గినవాటిని F-35B గా వర్గీకరించగా.. క్యారియర్-ఆధారిత (CV/CATOBAR) ఎయిర్‌క్రాఫ్ట్‌లను F-35C గా వర్గీకరించారు. ఈ విమానం 2001లో జాయింట్ స్ట్రైక్ ఫైటర్ (JSF) ప్రోగ్రామ్ పోటీని గెలుచుకుంది.
ఈ ఫైటర్ జెట్ తయారీకి అత్యధిక శాతం అమెరికాయే నిధులు సమకూర్చగా.. యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్ మరియు టర్కీ దేశాలు కూడా నిధులు సమకూర్చాయి. రష్యన్ S-400 వైమానిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన తర్వాత టర్కీని ఈ ప్రోగ్రామ్ నుంచి పక్కకు తప్పించారు. ఈ మిషన్‌లో ప్రయోగాత్మకంగా టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ X-35A మొదటిసారి అక్టోబర్ 2000లో ఎగిరింది. F-35 ప్రోటోటైప్ విమానం మొదటిసారి 2006లో బయటికొచ్చింది. F-35B 2015 జులైలో US మెరైన్ కోర్ విభాగంలోకి అడుగుపెట్టగా, 2016 ఆగస్టులో US ఎయిర్ ఫోర్స్ F-35A లను, 2019 ఫిబ్రవరిలో US నేవీ F-35C విమానాలను ప్రవేశపెట్టింది. ప్రత్యర్థిపై మెరుపు దాడులు చేయడానికి తగిన ఏవియానిక్స్, సెన్సార్ ఫ్యూజన్, అత్యాధునిక APG-81 AESA తరగతికి చెందిన రాడార్ ఇందులో ఉన్నాయి. అలాగే ఇందులో టాప్-ఎండ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ ఉంది. F-35 ను మానవసహిత-మానవరహిత పరీక్షలను కూడా ఎదుర్కొన్నది. ఇలా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు కల్గిన ఈ యుద్ధ విమానాలు అేక రకాల ఆయుధాలను ప్రయోగించగల సత్తా కలిగి ఉన్నాయి. ఇది అణు సామర్థ్యం కలిగిన ఏకైక 5వ తరం (5th Generation) యుద్ధ విమానం. హైపర్‌సోనిక్ క్షిపణులు, డైరెక్ట్ ఎనర్జీ ఆయుధాలను ఈ విమానం నుంచి ప్రయోగించవచ్చు.
ఎదురయ్యే సవాళ్లు..
ఈ తరహా యుద్ధ విమానాల రూపొందించే క్రమంలో అనుకున్నదాని కంటే ఖర్చు ఎక్కువైంది. అలాగే వాటిని సకాలంలో అందించలేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మూడు వేరియంట్లలో ఉమ్మడిగా 25% పరికరాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా 70% వరకు ఉమ్మడి పరికరాలు, మిగతా 30% వరకు వేరియంట్‌కు తగిన పరికరాలు ఉంటాయి. కానీ ఇందులో మూడు వేరియంట్లకు వేర్వేరుగా 75% పైగా పరికరాలు తయారుచేయాల్సి రావడంతో ఒక్కో విమానానికి దాదాపు $100 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇవి చాలా ఖరీదైన యుద్ధ విమానాలుగా మారాయి. తేలికపాటి చవక F-16తో పోల్చితే వీటి సంసిద్ధత 69 శాతం తక్కువ అని కొంతమంది రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ విమానాలను ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, దక్షిణ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ (UK), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) సైన్యాలు ఉపయోగిస్తున్నాయి. తైవాన్ ఒకప్పుడు F-35లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. కానీ అమెరికా విక్రయించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే.. ఒకవేళ ఈ యుద్ధ విమానం చైనా చేతిలో పడితే, దాని తయారీకి సంబంధించిన కీలక రహస్య సమాచారం ఆ దేశం చేతిలోకి వెళ్తుందని ఆందోళన చెందింది. 2023 మే లో 8 నుంచి 2 F-35 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు థాయ్‌ల్యాండ్ ఆసక్తి చూపగా.. అమెరికా అందుకు ప్రత్యామ్నాయంగా F-16 బ్లాక్ 70/72 వైపర్, F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలను అందించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదట్లో F-35లను కొనుగోలు చేయాలని కోరుకుంది, కానీ US విధించిన అదనపు నిబంధనలకు అంగీకరించడానికి సిద్ధంగా లేనందున ఆ దేశం వెనక్కి తగ్గింది.
F-35 ఆపరేషన్స్
ప్రపంచ్యాప్తంగా F-35లోని అన్ని వేరియంట్లను వేర్వేరు సందర్భాల్లో వినియోగిస్తున్నారు. 2016 జులైలో USMC F-35Bలు తమ మొదటి రెడ్ ఫ్లాగ్ విన్యాసంలో పాల్గొన్నాయి. మొదటి F-35B విదేశీ విన్యాసం 2017లో జపాన్‌లోని ఇవాకుని వద్ద జరిగింది. 2018జులైలో ఉభయచర దాడి నౌక USS ఎసెక్స్ నుండి ఫైటర్ జెట్లు ప్రయోగించగా.. 2018 సెప్టెంబర్ 27న ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్లపై మొదటి పోరాట దాడి జరిగింది. F-35Bలు శత్రు క్షిపణి నిశ్చితార్థ మండలాల్లోని మిత్రరాజ్యాల భూభాగంలోని తాత్కాలిక స్థావరాల నుండి పనిచేశాయి. మొదటి USMC F-35C స్క్వాడ్రన్ 2021 జులై నుంచి పనిచేయడం ప్రారంభించింది. 2019 ఏప్రిల్‌లో UAEలోని అల్ ధఫ్రా వైమానిక స్థావరంనుంచి ఉత్తర ఇరాక్‌లోని ఇస్లామిక్ స్టేట్ సొరంగం నెట్‌వర్క్‌పై వైమానిక దాడిలో మొదటిసారిగా యుద్ధంలో ఉపయోగించారు. ఆ ఏడాది జూన్‌లో ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలను గుర్తించేందుకు సాయుధ నిఘా విమానాల మాదిరిగా వీటిని ఉపయోగించారు. 2022 జనవరి నుంచి నార్వే తమ NATO క్విక్ రియాక్షన్ అలర్ట్ మిషన్ కోసం F-16 యుద్ధ విమానాల స్థానంలో F-35 లను భర్తీ చేసింది.
ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో వీటిని నిఘా కోసం పరీక్షించింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలోని శత్రు లక్ష్యాలను దాడి చేయడానికి విస్తృతంగా తన స్టెల్త్ ఫైటర్‌ను ఉపయోగించింది. వీటిలో గాజాలో జరిగిన తాజా దాడులు కూడా ఉన్నాయి. 2022 మార్చి 6న F-35I లు గాజా స్ట్రిప్‌కు ఆయుధాలను తీసుకువెళుతున్న రెండు ఇరానియన్ డ్రోన్‌లను కూల్చివేసాయి. F-35 నిర్వహించిన మొదటి రక్షణ చర్య ఇది.
భారతదేశం కోసం F-35
ఇప్పటివరకు అమెరికా అధికారికంగా F-35 ను భారతదేశానికి అందించలేదు. అమెరికాలో జరిగిన అధికార మార్పిడి భారత్‌కు కలిసొచ్చింది. నిజానికి 2023లోనే భారత్‌లో జరిగిన ఎయిరో ఇండియాలో F-35 లను తీసుకొచ్చి ప్రదర్శించారు. భారత గడ్డపై ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను నడపడం ఇదే తొలిసారి. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఏరో ఇండియాలో కూడా వీటిని విస్తృతంగా ప్రదర్శిస్తున్నారు. అమెరికా భారతదేశాన్ని ఒక అవకాశంగా చూస్తోంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అయితే F-35 కంటే ముందు భారతదేశం F-21 (ఆధునీకరించిన F-16) రకం యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని అమెరికా కోరుకుంటోంది. శత్రువుల కంటికి చిక్కకుండా దూసుకెళ్లగలిగే స్టెల్త్ లక్షణాలు కలిగిన యుద్ధ విమానాల అవసరం భారతదేశానికి ఎంతైనా ఉంది. అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) గా వ్యవహరించే ఈ రకం యుద్ధ విమానాల వియంలో భారత్ 15 ఏళ్లు వెనుకబడింది. ఈ క్రమంలో అమెరికా వీటిని అందించేందుకు ముందుకు రావడంతో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీటితో 2 స్క్వాడ్రన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
అయితే F-35 కొనుగోలుతో పాటు వాటి నిర్వహణ కూడా ఖరీదైన వ్యవహారమే. అయితే భారతదేశం ఇప్పటికే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి.. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దూసుకెళ్తోంది. ఈ క్రమంలో భారత్ తన రక్షణ అవసరాల కోసం ఖర్చును పెంచక తప్పదు. ఇప్పటి వరకు రష్యా నుంచి అందుతున్న రక్షణ సహకారం కారణంగా భారత వాయు సేన ప్రస్తుతం మిగులు మూలధన నిధులను కలిగి ఉంది. చైనా ఇప్పటికే ఐదవ తరం J-20 యుద్ధ విమానాలను సొంతంగా తయారు చేసుకుంది. పాకిస్తాన్ తన యుద్ధ విమానాల స్క్వాడ్రన్ బలాన్ని పెంచుకుంటోంది. ఈ క్రమంలో చైనా నుంచి J-35 స్టీల్త్ జెట్లను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో భారతదేశం వీలైనంత త్వరగా ‘స్టెల్త్ గ్యాప్’ను పూరించాల్సి ఉంది. దాదాపు 40 F-35లు, వాటికి సరిపడా ఆయుధాలను కొనుగోలు చేయడం వలన భారత వాయుసేన (IAF) కార్యాచరణ సామర్థ్యం పెరుగుతుంది. గగనతలంలో భద్రత మరింత పటిష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..