అమెరికాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీల సహా నలుగురు భారతీయుల సజీవ దహనం

అమెరికాలోని టెక్సాస్‌లో 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలతో సహా నలుగురు భారతీయులు మరణించారు.

అమెరికాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీల సహా నలుగురు భారతీయుల సజీవ దహనం
Texas Road Accident
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Balaraju Goud

Updated on: Sep 04, 2024 | 1:19 PM

అమెరికాలోని టెక్సాస్‌లో 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలతో సహా నలుగురు భారతీయులు మరణించారు. అందరూ ఒకే SUVలో భారతీయ కార్‌పూలింగ్ యాప్ ద్వారా అర్కాన్సాస్‌లోని బెంటన్‌విల్లేకు ప్రయాణిస్తున్నారు. మృతులను హైదరాబాద్‌కు ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి, ఫరూక్ షేక్, లోకేష్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కొల్లిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వైట్ స్ట్రీట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.. వేగంగా వచ్చిన ట్రక్ అదుపుతప్పి ఎస్‌యూవీ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ తర్వాత ట్రక్కు మరో నాలుగు వాహనాలను ఢీకొని డివైడర్‌ను ఢీకొట్టింది. అందరూ తేరుకునేలోపే SUV వాహనం మంటల్లో చిక్కుకుంది. నలుగురు భారతీయులు కారులో చిక్కుకున్నారు. మంటల కారణంగా నలుగురూ సజీవదహనమయ్యారు. కార్‌పూలింగ్ యాప్ ద్వారా స్థానిక పోలీసులు వారిని గుర్తించారు.

హైదరాబాద్ నివాసి ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి అతని స్నేహితుడు ఫరూక్ షేక్‌తో కలిసి డల్లాస్‌లోని తమ బంధువు వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, లోకేష్ తన భార్యను కలవడానికి బెంటన్‌విల్లేకు వెళ్తున్నాడు. ఇక తమిళనాడుకు చెందిన ధరిణి వాసుదేవన్ టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివిన తర్వాత అక్కడే పనిచేస్తున్నారు. ఆమె బెంటన్‌విల్లేలోని తన మామ వద్దకు వెళ్తున్నారు. ఈ నలుగురూ కార్‌పూలింగ్ యాప్‌ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత అర్కాన్సాస్‌లోని బెంటన్‌విల్లేకు వెళుతుండగా ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఆర్యన్ ఓరంపాటి ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికాకు వెళ్లాడు. అతని తండ్రి సుభాష్ చంద్రారెడ్డి హైదరాబాద్‌లో వ్యాపారవేత్త. హైదరాబాద్‌కు చెందిన ఫరూక్ షేక్ మాస్టర్స్ డిగ్రీ కోసం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి బెంటన్‌విల్లేలో నివసిస్తున్నాడు.

భారతీయులంతా కాలిపోయిన తర్వాత వారి మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. వారి శరీర భాగాల నమూనాలను DNA పరీక్ష కోసం ఉంచారు. 3 రోజుల తర్వాత కుమార్తె మృతి చెందిన విషయం ధరిణి తండ్రికి తెలిసింది. అంతకు ముందు, తన కూతురు అదృశ్యంపై సమాచారంతో ట్విట్టర్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహాయం కోరారు. కాగా, వారి అవశేషాలు భారత్ రప్పించేందుకు బాధితుల కుటుంబాలు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల సహాయాన్ని కోరుతున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..