Iran-Israel War: బాంబుల వర్షం.. ప్రాణభయంతో వణుకుతున్న జనం.. బంకర్లలలో జీవనం
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. బాంబు దాడులతో ఇరు దేశాల జనజీవనం అతలాకుతలం అవుతోంది. అక్కడి దేశ ప్రజలు ఎలా ఉందో కానీ బతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకుని ఇరాన్, ఇజ్రాయెల్ ల బాట పట్టిన వలస జీవుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉంది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. బాంబు దాడులతో ఇరు దేశాల జనజీవనం అతలాకుతలం అవుతోంది. అక్కడి దేశ ప్రజలు ఎలా ఉందో కానీ బతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకుని ఇరాన్, ఇజ్రాయెల్ ల బాట పట్టిన వలస జీవుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉంది. తెలుగు వారు.. అందులోను ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన వందలాది మంది బాధితులు ప్రాణాలు కాపాడుకునేందుకు బంకర్లలలో తలదాచుకుంటూ బిక్కు బిక్కుమంటూ గడుపుతుండగా.. తాజాగా సమీప జిల్లా జగిత్యాల వాసి బంకర్ లో గుండెపోటుతో మృతి చెందడంతో జిల్లా వాసుల్లో ఆ భయం రెట్టింపైంది. యుద్దంలో ప్రాణాలతో బయటపడుతామా.. తిరిగి ఇంటికి సజీవంగా చేరుకుంటామా లేదా అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇజ్రాయెల్ లో పని చేస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ బాదితులు. విరుచుకు పడుతున్న మిస్సైల్లతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నామంటున్నారు జిల్లా వాసులు.
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో జీవనం సాగిస్తున్న నిర్మల్ జిల్లా సారంగ పూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం తమను కాపాడాలంటూ ఇండియన్ ఎంబసీని ఆశ్రయించింది. తాముంటున్న ప్రాంతంలో బాంబుల వర్షం కురుస్తోందని సోషల్ మీడియాలో ఫోటోలు , వీడియోలు షేర్ చేశారు. ఎలాగైనా తమను ఇండియాకు తరలించాలని వేడుకుంటున్నారు. ఆదిలాబాద్ , నిర్మల్, ఖానాపూర్ , కడెం , బైంసా కు చెందిన 300 మంది టెల్ అవీవ్ లో ఉన్నట్టు చెప్తున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఏడో రోజుకు చేరుకోవడంతో ఆస్తి నష్టం విపరీతంగా పెరిగింది. తమ అణు స్థావరాలను ధ్వంసం చేయడంతో అత్యున్నత సైనికాధికారులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో ఇరాన్.. ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ రాజదాని టెల్ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాసులు కుటుంబ సభ్యులకు గోడు వెళ్లబోసుకుంటున్నారు. దట్టమైన నల్లటి పొగ అలుముకుందని… ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారో తెలియడం లేదని ఇజ్రాయెల్ లో వలస జీవులుగా బతుకుతున్న నిర్మల్ జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పని చేస్తున్న యజమానులు ఇళ్లు ధ్వంసమయ్యాయని.. సాధారణ పౌరులను సైతం ఇరాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుందని కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని అమెరికన్ కాన్సులేట్ను తాకిందని… దీంతో కాన్సులేట్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు అమెరికా రాయబారి మైక్ హకాబీ చెప్పుకొచ్చారు. తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ముందుజాగ్రత్తగా చర్య టెల్ అవీవ్లోని అమెరికన్ కాన్సులేట్ తో పాటు జెరూసలేంలోని అమెరికా ఎంబసీని రెండు రోజుల క్రితమే మూసివేశారు. ఇరాన్ దాడుల్లో తమ దేశంలో ఇప్పటిదాకా 54 మంది మరణించారని, 800 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ సైన్యం 400 పైగా మిస్సైళ్లు, వందలాది డ్రోన్లు ప్రయోగించినట్లు పేర్కొంది.
బాంబుల మోతలతో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని.. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు అక్కడి తెలుగు వారు. యుద్దం వారం రోజులకు చేరుకుందని.. రోజురోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని.. ఎప్పుడు ఏం అవుతుందని తెలియడం లేదని చెప్తున్నారు జిల్లా వాసులు. ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్ లో నివసిస్తున్న.. వలస వెళ్లిన వారికి సాయం అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సహాయం కోసం పీఎస్ రెసిడెంట్ కమిషనర్ వందన, (+91 9871999044) లైజన్ ఆఫీసర్లు జి రక్షిత్ నాయక్ (+91 9643723157), జావేద్ హుస్సేన్ (+91 9910014749), పౌర సంబంధాల అధికారి పీహెచ్ చక్రవర్తి (+91 9949351270)ని సంప్రదించాలని అధికారులు సూచించారు.