Trump Tariffs: మరోసారి ట్రంప్ సుంకాల మోత… మెక్సికో, ఈయూ దేశాలపై 30 శాతం ట్యాక్స్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగిస్తూనే ఉన్నారు. తాజాగా మెక్సికో, ఈయూ దేశాలపై 30 శాతం ట్యాక్స్ విధించారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు ట్రంప్. ఇప్పటికే పలు దేశాలపై...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగిస్తూనే ఉన్నారు. తాజాగా మెక్సికో, ఈయూ దేశాలపై 30 శాతం ట్యాక్స్ విధించారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు ట్రంప్. ఇప్పటికే పలు దేశాలపై అధిక సుంకాలు విధించారు. జపాన్, దక్షిణ కొరియాపై 25 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ టారిఫ్‌లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఈ మేరకు రెండు దేశాలకు ట్రంప్ లేఖలు రాశారు. జపాన్, దక్షిణ కొరియాల పరస్పర సుంకాల పెంపుదలకు వ్యతిరేకంగా ట్రంప్ లేఖలో హెచ్చరించారు.
ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అదనపు దిగుమతి సుంకాలను విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. జపాన్, దక్షిణ కొరియా రెండూ తమ వాణిజ్య విధానాలను సవరించుకుంటే సుంకాలను తగ్గించడానికి తాను సిద్ధమనే సంకేతాలు పంపారు ట్రంప్. సుంకాల ఉపశమనానికి ఇచ్చిన 90రోజుల గడువును ఆగస్టు 1 వరకూ పొడిగిస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఈలోగా చర్చలకు రావాలని ఆయా దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు.
అమెరికా విధానాలను వ్యతిరేకిస్తున్న బ్రిక్స్ దేశాలకు 10శాతం అదనపు సుంకం తప్పదన్న ట్రంప్ హెచ్చరించారు. అన్నట్లుగానే బ్రెజిల్‌పై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఆ దేశంపై 50శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోని వేధిస్తున్నారనే ఆరోపణలతో ఆ దేశంపై 50 శాతం సుంకం విధించారు. ఈమధ్యే అమెరికా విధానాలను వ్యతిరేకించే బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10 శాతం అదనపు సుంకం విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీనికి బ్రెజిల్ ప్రెసిడెంట్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కెనడా తర్వాత అమెరికాకు అతిపెద్ద ఉక్కు ఎగుమతిదారుగా ఉన్న బ్రెజిల్.. ట్రంప్ చర్యలను చట్టపరంగానే ఎదుర్కుంటామని చెప్పారు.
అంతకు ముందు ఈ ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ట్రంప్ ఇగో హర్ట్ అయింది. బ్రెజిల్‌పై విధించిన 50శాతం సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు. మరోవైపు ట్రంప్ కలపై చైనా స్పందించింది. సుంకాలు బెదిరింపు సాధనంగా మారకూడదని, అవి ఎవరికీ ఉపయోగపడవంటోంది చైనా.




