US Election Process: తుది అంకానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా?

అమెరికా ఎన్నికల్లో ఓటింగ్‌ ప్రక్రియ మూడు రకాలుగా సాగుతుంది. బ్యాలట్‌ పేపర్లు, బ్యాలట్‌ మార్కింగ్‌ డివైస్‌లు, డైరెక్ట్‌ రికార్డింగ్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌లో ఓటింగ్‌ జరుగుతుంది.

US Election Process: తుది అంకానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా?
Us Election Process
Follow us

|

Updated on: Nov 05, 2024 | 10:10 AM

నాలుగేళ్లకి ఓసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది అంకం ప్రారంభం కాబోతోంది. ఈరోజు అంటే మంగళవారం(నవంబర్ 5) అమెరికా వ్యాప్తంగా జరిగే ఓటింగ్‌ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఆరుగురు బరిలో ఉన్నా.. పోటీ మాత్రం ఇద్దరి మధ్యే ఉంది. డెమొక్రాట్‌ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ బరిలో దిగుతున్నారు. ఇండిపెండెంట్లుగా మరో నలుగురు ఉన్నా.. వారి పేరు రేసులో వినిపించడం లేదు.

అన్ని రాష్ట్రాల్లోనూ వారి వారి కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మొదలవుతుంది. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే పార్టీలు విస్త్రృత ప్రచారం చేశాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలప్రక్రియ ఎలా సాగబోతోంది?

భారత్‌ లాంటి దేశాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి.. కాని అమెరికాలో ఎలక్షన్‌ సిస్టమ్‌ వేరుగా ఉంటుంది. అక్కడ అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం తరఫున ఎలక్షన్‌ కమిషన్‌ ఉన్నా.. అది పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. మిగిలిన ప్రక్రియ రాష్ట్రాల చేతిలో ఉంటుంది. ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక ఎలక్షన్‌ రెగ్యులేటరీ ఉంటుంది. బ్యాలట్‌ పేపర్‌ డిజైన్‌ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండదు. కౌంటింగ్‌ ప్రక్రియ కూడా ఏరాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే అమెరికా ఎలక్షన్‌ ప్రాసెస్‌ క్లిష్టంగా.. రోజుల తరబడి సాగుతుంది.

అమెరికా ఎన్నికల్లో ఓటింగ్‌ ప్రక్రియ మూడు రకాలుగా సాగుతుంది. బ్యాలట్‌ పేపర్లు, బ్యాలట్‌ మార్కింగ్‌ డివైస్‌లు, డైరెక్ట్‌ రికార్డింగ్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌లో ఓటింగ్‌ జరుగుతుంది. దేశంలో 70శాతం మంది బ్యాలట్‌ పేపర్లతోనే ఓటింగ్‌ వేస్తున్నారు. తమకు నచ్చిన అభ్యర్థి పక్కన మార్కింగ్‌ చేసి.. బ్యాలట్‌ బాక్సులో వేస్తారు. ఇది దేశంలో అత్యధిక ప్రజలు ఇష్టపడే ప్రక్రియ.

ఇక రెండోది BMD ప్రక్రియ. ఇక్కడ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు ఉన్నా.. అవి ప్రామాణికం కావు. బాలట్‌ మార్కింగ్‌ డివైస్‌లో తమకు నచ్చిన అభ్యర్థిపై మార్కింగ్‌ చేసి.. దాన్ని ప్రింట్‌ తీస్తారు. అనంతరం ఆ ప్రింట్‌ను బ్యాలట్‌ బాక్స్‌లో వేస్తారు. ఆ బాలట్‌ బాక్సులోని ఓట్లే ప్రామాణికం. అమెరికాలో 25శాతం మంది BMDతో ఓట్లు వేస్తున్నారు.

ఇక మూడో ప్రక్రియ..భారత్‌లో ఇప్పుడు మనం వేస్తున్న ఈవీఎం ఓటింగ్‌ లాంటిదే. అయితే అమెరికాలో కేవలం 5శాతం ఓటర్లే దీనివైపు మొగ్గుచూపుతున్నారు. డైరెక్ట్‌ రికార్డింగ్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌లో ఓటువేసి.. అందులో భద్రపరిచిన ఓట్లను తర్వాత లెక్కిస్తారు. అయితే ఈ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ 2016కి ముందు వరకు ఉండేది. ట్యాంపరింగ్‌తోపాటు.. సెక్యూరిటీ లీక్‌ ఉందన్న ఆరోపణలతో.. 2016 నుంచి బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియను మళ్లీ తీసుకొచ్చాయి అమెరికా ఫెడరల్‌ రాష్ట్రాలు. వీటితోపాటు.. అఫీషియల్‌ పనుల్లో ఉన్నవారు.. సైనికులు, విదేశాల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్లు, ఎలక్ట్రానిక్‌ మెయిల్‌ ఇన్‌ బ్యాలట్లతో ఓటింగ్‌లో పాల్గొంటారు. కొన్ని రాష్ట్రాల్లో పోస్టల్‌ బ్యాలట్లను ముందే లెక్కిస్తారు.. కాని ఫలితాలు ఎలక్షన్‌ తర్వాతే ప్రకటిస్తారు.

ఇక ఓటింగ్‌ ప్రక్రియ ముగియగానే.. లెక్కింపు ఉంటుంది. బ్యాలెట్‌ పేపర్లను మనదగ్గర లెక్కించినట్లుగా కాకుండా.. అమెరికాలో కొత్త పద్దతులను అనుసరిస్తున్నారు. మార్కింగ్‌ చేసిన బాలట్లను ఎలక్ట్రానిక్‌ స్కానర్లను ఉపయోగించి లెక్కిస్తారు. మనదగ్గర పరీక్షలకు ఉపయోగించే ఓఎమ్మార్‌ షీట్లను స్కానింగ్‌ ద్వారా వెరిఫై చేసినట్లుగా.. అక్కడ బ్యాలెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. ఇలా అన్ని బ్యాలటర్లను లెక్కించి ఫలితాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంటారు. అయితే బ్యాలట్‌ పేపర్లను మడతపెట్టి బాక్సుల్లో వేస్తారు కాబట్టి.. వాటిని సరిచేసి.. లెక్కించే మెషీన్లో పెట్టే ప్రక్రియ లేట్‌ అవుతుంది.

అంతేకాకుండా బ్యాలట్‌ పేపర్‌ క్వాలిటీ కూడా భారీగా ఉండడం వల్ల వాటిని లెక్కింపు కేంద్రాలకు తరలించడం.. అక్కడ కొనసాగే ప్రాసెస్‌ నెమ్మదిగా సాగుతుంటుంది. దీనివల్ల కనీసం రెండు మూడు రోజులు ఫలితాల లెక్కింపు ఉండబోతోంది. అయితే అభ్యర్థులు పలు రాష్ట్రాల్‌లో రీకౌంటింగ్‌కు వెళ్లడం.. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర సపోర్టర్ల హడావుడి.. కొట్లాటలు అమెరికాలోనూ కామనే కాబట్టి.. ఈసారి కూడా ఫలితాలు రసవత్తరంగా ఉండబోతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..