WHO Warning: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసింది. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఆంక్షలు, వ్యాక్సినేషన్, ఇతర చర్యల కారణంగా ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. ఇక కరోనా కథ ముగిసిందని చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. ముందే పండగ సీజన్. మరింతగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని ఇప్పటికే పరిశోధకులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కథ ముగిసిందని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దని, నిర్లక్ష్యం వహిస్తే విజృంభించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మధ్యలోనే ఉన్నామని సూచించింది. కొందరు కోవిడ్ ముగిసిపోయిందని నిర్లక్ష్యంగా తిరుగుతున్నారని, ఇలాంటి నిర్లక్ష్యమే కొంపముంచుతుందని హెచ్చరించింది.
గతవారం ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారని, అలాగే మరో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. వాస్తవంగా ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని తెలిపింది. కరోనా కష్టకాలం మొదలై దాదాపు రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది బలయ్యారని, కొన్ని చోట్ల ఐసీయూలు, ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా ముగిసిందని ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా అయితే పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. వైరస్ తగ్గుముఖం పట్టినా.. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
వ్యాక్సిన్ తీసుకోనివారే ఎక్కువగా చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ విభాగం చీఫ్ మారియా వన్ కెర్ఖోవ్ అన్నారు. కోవిడ్-19పై ట్విట్టర్‌లో లైవ్ నిర్వహించిన కెర్ఖోవ్.. ‘పరిస్థితి ఇప్పటికీ చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ వైరస్ మీద ఇంకా నియంత్రణ సాధించలేదు. మనం ఇంకా ముప్పు నుంచి బయటపడలేదు. ప్రస్తుతం మహమ్మారికి చాలా మధ్యలో ఉన్నాం. కానీ అది ఎక్కడ అనేది ఇంకా కచ్చితంగా తెలియలేదు. కొన్ని నగరాల్లో ఐసీయూలు, ఆస్పత్రులన్నీ నిండిపోయి ప్రాణాల కోసం పోరాడుతున్నారు అని అన్నారు.