ప్రపంచ దేశాల్లో తమ అధిపత్యం కొనసాగాలనే తలంపుతో చైనా అక్రమ ఆగడాలకు అంతులేకుండా పోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఎదగాలని చూస్తోన్న చైనా కొన్ని అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతోందని అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఐర్లాండ్‌తోపాటు అనేక దేశాల్లో చైనా ప్రభుత్వం అక్రమంగా పోలీస్ పోస్టులను ఏర్పాటు చేసిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. విదేశాల్లో ఉంటూ.. సొంత దేశంపై వ్యతరేకంగా మాట్లాడే వారిని అణచివేసే లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలతో పాటు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల్లోనూ చైనా తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. విదేశీ గడ్డపై చైనాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అణచి వేసేందుకు కెనడాలో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోకి అనుబంధంగా అనధికారిక పోలీస్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం కెనడా వ్యాప్తంగా పీఎస్‌బీలకు అనుబంధంగా ఈ పోలీస్ స్టేషన్లను చైనా ఏర్పాటు చేసింది. కేవలం కెనడాలోని గ్రేటర్ టొరంటో ప్రాంతంలోనే కనీసం మూడు స్టేషన్లు ఏర్పాటుచేసింది. వీటితోపాటు ఈ చట్టవిరుద్ధమైన కేంద్రాల ద్వారా ఆయా దేశాల్లో జరిగే ఎన్నికల్లోనూ చైనా ప్రభుత్వం ప్రభావితం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఇప్పటివరకు 21 దేశాల్లో 30 స్టేషన్లను తెరిచినట్లు సమాచారం. చైనా పోలీస్ స్టేషన్ల కోసం ఉక్రెయిన్, ఫ్రాన్స్,స్పెయిన్, జర్మనీతోపాటు యూకే దేశాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే విదేశాల్లోని తమ పౌరులకు సహాయం చేసేందుకు ఫ్యూజో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో పేరుతో ప్రపంచ దేశాల్లో చైనా ప్రభుత్వం పోలీస్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు ఇతర విషయాల్లో స్థానిక పోలీసులకు సహకరించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చైనా చెప్పుకుంటోంది. ఇదే సమయంలో ఏదైనా కేసుల్లో చిక్కుకునే చైనీయులను న్యాయం పేరుతో స్వదేశానికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా గడిచిన ఏడాదిన్నర కాలంలోనే రెండు లక్షలకు పైగా తమ పౌరులను సొంత దేశానికి తరలించినట్లు సేఫ్‌గార్డ్ డిఫెండర్స్ అనే నివేదిక వెల్లడించింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా నిఘా ఉంచేందుకు అక్రమ కార్యక్రమాలకు పాల్పడుతుందనే విమర్శలు చైనాపై వినిపిస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..