China: 300 డ్యామ్‌లను కూల్చేసిన చైనా… ఒకే ఒక్క చేప కోసం… ఒకే ఒక్క చేప కోసం డ్రాగన్ కంట్రీ కఠిన నిర్ణయాలు
నదులపై డ్యామ్‌ల నిర్మాణంతో అభివృద్ధి సాధ్యం అనేది మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయం. అందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వాలు వెనకాడవు. అలాంటిది చైనాలో మాత్రం రివర్స్ జరుగుతోంది. ఇప్పటి వరకు కట్టిన డ్యామ్‌లన్నీ కూల్చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా...

నదులపై డ్యామ్‌ల నిర్మాణంతో అభివృద్ధి సాధ్యం అనేది మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయం. అందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వాలు వెనకాడవు. అలాంటిది చైనాలో మాత్రం రివర్స్ జరుగుతోంది. ఇప్పటి వరకు కట్టిన డ్యామ్‌లన్నీ కూల్చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఇప్పటి వరకు 300 డ్యామ్‌లు కూల్చేసింది. అంతేకాదు 373 హైడ్రోపవర్ స్టేషన్లలో 342 చిన్నస్థాయి జల విద్యుత్ కేంద్రాల్లో కార్యకలాపలు ఎక్కడికక్కడ బంద్ పెట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా డ్రాగన్ కంట్రీ కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్యామ్‌ల కూల్చివేత చర్యలు 2020 నుంచే మొదలు పెట్టినట్లు సమాచారం.
ఆసియాలోనే ఈతి పొడవైన యాంగ్జీ నదిపై చైనా గత కొన్ని దశాబ్దాల కాలంలో భారీస్థాయిలో డ్యామ్‌లు, జల విద్యుత్ కేంద్రాలు నిర్మించింది. దీంతో పర్యావరణాకి పెను ముప్పు వాటిల్లింది. నదిని ఆధారంగా చేసుకుని జీవించే జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. యాంగ్జీ ఉపనదుల్లో ఒకటైన చిషుయ్ హే (రెడ్‌రివర్)లో అరుదైన చేపలు దొరుకుతుంటాయి. యునాన్, గుయిజౌ, సిచువాన్ నైరుతి ప్రావిన్సుల ద్వారా ఎర్ర నది 400 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. డ్యామ్‌లు, జలవిద్యుత్ కేంద్రాలు ఆ నదీ ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. నదీ పరివాహక ప్రాంతం ఎండిపోవడంతో అరుదైన చేపలు అంతిరించిపోయే దశకు చేరుకున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతినడంతో పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళనను వ్యక్తంచేశారు.
యాంగ్జీ స్టర్జన్‌గా పేరుపొందిన స్టర్జన్ ఫ్యామిలీకి చెందిన చేపను 2022లో అంతరించిపోతున్న జాతిగా ప్రకటించారు. గతంలో ఆ చేపలు యాంగ్జీ పరివాహక ప్రాంతంలో విరివిగా లభించేవి. 1970 నుంచి స్టర్జన్ సంతతి పడిపోతున్నట్లు గుర్తించారు. డ్యామ్‌ల నిర్మాణం, అతిగా చేపలు పట్టడం వంటివి చేపల మనుగడకు ఆటంకంగా మారినట్లు భావిస్తున్నారు. డ్యామ్‌ల కూల్చివేతతో రెడ్ రివర్ పునరుద్ధరణ జరిగి ఆరుదైన చేపల జాతి మళ్లీ ప్రాణం పోసుకుంటుందని పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు. 2023, 2024లో రెండు బ్యాచ్‌ల యాంగ్జీ స్టర్జన్‌లను నదిలోకి వదలి పరీక్షించారు. అవి విజయవంతంగా వాటి సంతతిని పెంపొందించుకున్నట్లుగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు.
