స్కెచ్ వేస్తే బుక్కవ్వాల్సిందే.. ఆఫీస్‌లో వందలాది మంది అమ్మాయిలు, అబ్బాయిలు.. ఏం చేస్తున్నారో తెలుసా..?

'కంబోడియా' పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయాల సమూహంగా పేరొందిన 'అంగ్‌కోర్‌వాట్' దేవాలయం. కానీ ఇప్పుడు ఆ దేశం పేరు చెబితే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలే గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్, హనీ ట్రాప్స్ సహా అనేక రకాల ఆన్‌లైన్ మోసాలకు ఆ దేశం అడ్డాగా మారింది.

స్కెచ్ వేస్తే బుక్కవ్వాల్సిందే.. ఆఫీస్‌లో వందలాది మంది అమ్మాయిలు, అబ్బాయిలు.. ఏం చేస్తున్నారో తెలుసా..?
Cambodia Cybercrime

Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 24, 2025 | 2:07 PM

‘కంబోడియా’ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయాల సమూహంగా పేరొందిన ‘అంగ్‌కోర్‌వాట్’ దేవాలయం. కానీ ఇప్పుడు ఆ దేశం పేరు చెబితే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలే గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్, హనీ ట్రాప్స్ సహా అనేక రకాల ఆన్‌లైన్ మోసాలకు ఆ దేశం అడ్డాగా మారింది. భారత్ సహా అనేక దేశాల ప్రజలు ఈ మోసాలబారిన పడి తమ కష్టార్జితం మొత్తం పోగొట్టుకుంటున్నారు. ఈ సైబర్ మోసాలకు వ్యతిరేకంగా భారత హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సమాచారంతో కంబోడియా పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 105 మంది భారతీయులు సహా 3,075 మందిని అరెస్టయ్యారు. జూన్ 27 నుంచి జూలై 22 వరకు 15 రోజుల పాటు కంబోడియా రాజధాని ‘ఫ్నామ్ పెన్’ సహా 16 ప్రావిన్స్‌లలో 138 ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్ ఆగ్నేయ ఆసియాలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సైబర్ క్రైమ్ క్రాక్‌డౌన్‌లలో ఒకటిగా నిలిచింది.

ఆపరేషన్ సాగింది ఇలా..

కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో 1,028 చైనీస్, 693 వియత్నామీస్, 366 ఇండోనేషియన్లు, 101 బంగ్లాదేశీలు, 82 థాయ్‌లు, 57 కొరియన్లు, 81 పాకిస్థానీలు, 13 నేపాళీలు, 4 మలేషియన్లతో పాటు ఫిలిప్పీన్స్, లావోస్, కామెరూన్, నైజీరియా, ఉగాండా, సియెరా లియోన్, మంగోలియా, రష్యా, మయన్మార్ దేశాల నుంచి కొందరు అరెస్టయ్యారు. ఈ దాడుల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, వందల సంఖ్యలో మొబైల్ ఫోన్లు, డ్రగ్ ప్రాసెసింగ్ సామగ్రి, ఎక్స్‌టసీ పౌడర్, మాదక ద్రవ్యాలు, నకిలీ ఇండియన్ మరియు చైనీస్ పోలీసు యూనిఫామ్‌లు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సైబర్ మోసాల నెట్‌వర్క్‌ల బహిర్గతం

ఈ ఆపరేషన్‌లో చైనీస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్‌లు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ బహిర్గతమైంది. ఈ ముఠాలు భారత్‌ సహా ఆసియా, ఇతర దేశాలలోని కస్టమర్లు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు, క్రిప్టో మోసాలు, హనీట్రాప్‌లు, డిజిటల్ అరెస్ట్‌ల వంటి మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ ముఠాల్లో పనిచేయడానికి ఉద్యోగ అవకాశాల పేరుతో యువతను తీసుకొచ్చి, బానిసలుగా మార్చి, హింసించి, బయటకు రాకుండా నిర్బంధిస్తున్నారు. ఈ విషయం ఐక్యరాష్ట్ర సమితి (UN) నివేదికల్లో పేర్కొంది. ఒక్క కంబోడియాలోనే 100,000 మందికి పైగా ఈ వ్యవస్థీకృత నేర సామ్రాజ్యంలో బంధీలుగా మారి పనిచేస్తున్నారని అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి

Online Scams

భారత ప్రభుత్వం చర్యలు..

భారత ప్రభుత్వం ఈ సైబర్ మోసాలపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. కాలర్ ట్యూన్ల నుంచి మొదలుపెట్టి విస్తృత ప్రచార కార్యక్రమాల సామాన్య ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రపంచంలో సుదూరతీరాల్లో నుంచి ఆపరేట్ చేస్తున్న క్రిమినల్ గ్యాంగ్స్ ను పట్టుకునే వరకు నిర్విరామంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. గత నెలలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ అధికారులతో కంబోడియా అధికారులు జరిపిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. భారత రాయబార కార్యాలయం ఫ్నామ్ పెన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కంట్రోల్ రూమ్ ద్వారా 360 మంది భారతీయులను ఇప్పటికే రక్షించి స్వదేశానికి తీసుకొచ్చారు. వీరిలో 60 మందిని మే 20న రెస్క్యూ చేశారు. అరెస్టైన 105 మంది భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చే ప్రక్రియలో భారత ప్రభుత్వం కంబోడియా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

ఎన్ని రకాలుగా మోసగిస్తారంటే?

I4C నివేదికల ప్రకారం ఈ సైబర్ మోసాలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉన్నాయి:

– 1. ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు: 62,687 ఫిర్యాదులు, రూ. 222.58 కోట్లు నష్టం.

– 2. ట్రేడింగ్ స్కామ్‌లు: 20,043 ఫిర్యాదులు, రూ. 1,420.48 కోట్లు నష్టం.

– 3. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు: 4,599 ఫిర్యాదులు, రూ. 120.3 కోట్లు నష్టం.

– 4. రొమాన్స్/డేటింగ్ స్కామ్‌లు: 1,725 ఫిర్యాదులు, రూ. 13.23 కోట్లు నష్టం.

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లలో, మోసగాళ్లు నకిలీ పోలీసు అధికారులుగా నటించి, బాధితులకు ఫోన్ కాల్స్ లేదా వీడియో కాల్స్ ద్వారా బెదిరించి, వారిపై తప్పుడు అభియోగాలు మోపి డబ్బు గంజుతున్నారు. సోషల్ మీడియా ద్వారా బాధితుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఆ డేటాను దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

భారతీయులను ఎలా ఆకర్షిస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతను డేటా ఎంట్రీ ఉద్యోగాలు లేదా ఐటీ రంగంలో ఆకర్షణీయ ఉద్యోగ అవకాశాల పేరుతో ఈ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లు ఆకర్షిస్తున్నాయి. ముందు థాయ్‌లాండ్‌ దేశానికి టూరిస్ట్ వీసాలపై తీసుకెళ్లి, అక్కడి నుంచి కంబోడియా, మయన్మార్, లావోస్ వంటి దేశాల్లోని స్కామ్ కాంపౌండ్‌లకు తరలిస్తున్నాయి. అక్కడ వారిని బానిసలుగా మార్చి, రోజుకు 12-16 గంటలు పనిచేయమని బలవంతం చేస్తున్నారు. రెస్క్యూ అనంతరం బయటపడ్డ యువకులు చెప్పిన సమాచారం ప్రకారం పారిపోయేందుకు ప్రయత్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు. హత్యలు చేయడానికి సైతం ఈ క్రిమినల్ గ్యాంగ్స్ వెనుకాడడం లేదు.

భారత ప్రభుత్వం ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు భారతీయులు ఈ సైబర్ మోసాల వల్ల రూ. 7,061.51 కోట్లు కోల్పోయారని I4C నివేదికలు పేర్కొన్నాయి. ఈ నష్టాలను అరికట్టేందుకు, I4C 3.25 లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. 3,000 URLలు, 595 యాప్‌లను బ్లాక్ చేసింది. అలాగే 5.3 లక్షల సిమ్ కార్డులు, 80,848 IMEI నంబర్లను సస్పెండ్ చేసింది. మరో 1,000 స్కైప్ IDలను బ్లాక్ చేయడానికి మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేసింది.

విదేశీ ఉద్యోగ అవకాశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. “కంబోడియా, లావోస్, మయన్మార్‌లలో ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయులు, నకిలీ ఏజెంట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా మోసపోకుండా, కేవలం MEA ఆమోదిత ఏజెంట్ల ద్వారానే ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి” అని ఒక అడ్వైజరీలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయవద్దని, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత వివరాలను బహిరంగంగా పోస్ట్ చేయవద్దని I4C సూచించింది.

ఈ ఆపరేషన్ కంబోడియాను సైబర్ క్రైమ్ హబ్‌గా మార్చిన అంతర్జాతీయ నెట్‌వర్క్‌లను బహిర్గతం చేసింది. భారత ప్రభుత్వం, కంబోడియా అధికారుల సమన్వయ చర్యలు ఈ మోసాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించాలంటే, అంతర్జాతీయ సహకారంతో పాటు ప్రజల్ల అవగాహన పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..