Sheikh Hasina: చంపాలనే కుట్ర.. ఉరిశిక్షపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఏమన్నారంటే..?
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. గత ఏడాది జరిగిన ఢాకా అల్లర్ల కేసులో ఆమెను దోషిగా నిర్ధారించిన కోర్టు, ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పుపై షేక్ హసీనా తీవ్రంగా స్పందించింది.

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు ఉరిశిక్ష విధించడం సంచలనంగా మారింది. గత ఏడాది జరిగిన ఢాకా అల్లర్ల కేసులో ఆమెను దోషిగా నిర్ధారించిన కోర్టు.. ఉరిశిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన షేక్ హసీనాపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హసీనా తీరు.. మానవత్వానికి మచ్చ అని ట్రిబ్యునల్ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిరసనకారులను అణచివేసే క్రమంలో ఆమె ప్రభుత్వం అమాయకులను కాల్చిచంపాలని ఆదేశాలు ఇచ్చిందని కోర్టు నిర్ధారించింది.
ఇక ఈ తీర్పుపై హసీనా తీవ్రంగా స్పందించింది. ఈ తీర్పు పక్షపాతంతో ఇచ్చిందని.. రాజకీయ ప్రత్యర్థులు తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని హసీనా ఆరోపించారు. హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ కూడా ఈ తీర్పుపై తీవ్రంగా స్పందించింది. తాత్కాలిక ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు హసీనాను చంపాలనే ఉద్దేశంతోనే ఈ శిక్షను వేయించారని ఆరోపించింది.
ఇక తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు రాకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర్పుకు ఒక రోజు ముందు హసీనాకు మద్దతుగా ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాల్పులు, పేలుళ్లకు పాల్పడే వారిపై కనిపించగానే కాల్చేయాలని ఢాకా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా తాత్కాలిక ప్రభుత్వం తరపున ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్.. హసీనాను తిరిగి అప్పగించాలని భారత్‌ను గతంలోనే కోరగా.. దానిపై భారత్ స్పందించలేదు.
ట్రిబ్యునల్ తన అభియోగ పత్రంలో షేక్ హసీనా తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ముఖ్యంగా ఆగస్టు 5న చంఖర్‌పుల్‌లో ఆరుగురు నిరసనకారులు మారణాయుధాలను ఉపయోగించి చంపిన సంఘటనను ప్రస్తావించింది. షేక్ హసీనా ఆదేశాల వల్లే విద్యార్థులు చనిపోయారని.. అలాంటి చర్యల ద్వారా ఆమె మానవత్వానికి మచ్చ తెచ్చే నేరాలకు పాల్పడ్డార అని వ్యాఖ్యానించింది. మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు కూడా ఉరిశిక్ష విధించింది. హసీనా, కమల్ ఇద్దరూ దేశం విడిచి పారిపోయి ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
