Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో మూడు హిందూ ఆలయాలపై దాడులు

|

Nov 30, 2024 | 10:19 AM

బంగ్లాదేశ్‌లో హిందువులపై భీభత్సం కొనసాగుతోంది. ఛటోగ్రామ్‌లో మూడు ఆలయాలు ధ్వంసం చేశారు. వందలాది మంది ప్రజలు నినాదాలు చేస్తూ ఇటుకలు, రాళ్లను దేవాలయాలపై విసిరారు, దీని కారణంగా శనీశ్వర ఆలయం, మరో రెండు ఆలయాల తలుపులు దెబ్బతిన్నాయి. కొత్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ఈ దాడిని ధృవీకరించారు. దాడి చేసినవారు దేవాలయాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. అయితే ఆలయాలకు చాలా తక్కువ నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు.

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో మూడు హిందూ ఆలయాలపై దాడులు
Three Temples Vandalized In Chattogram
Follow us on

శుక్రవారం బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో మూడు హిందూ దేవాలయాలపై నినాదాలు చేస్తూ మూకుమ్మడి దాడి చేసి ఆలయాలను ధ్వంసం చేశారు. ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మయ్ దాస్‌పై దేశద్రోహం కేసు నమోదైన తర్వాత ఛటోగ్రామ్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఓడరేవు నగరంలోని హరీష్ చంద్ర మున్సెఫ్ లేన్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు దాడి జరిగింది. శాంతనేశ్వరి మాతృ మందిరం, శనీశ్వర ఆలయం, శాంతనేశ్వరి కలిబారి ఆలయం లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.

వందలాది మంది వ్యక్తులు నినాదాలు చేస్తూ ఆలయాలపైకి ఇటుకలు, రాళ్లు విసిరారని దీని కారణంగా శనీశ్వర ఆలయంతో పాటు మరో రెండు ఆలయాల తలుపులు దెబ్బతిన్నాయని ఆలయ అధికారులు చెప్పిన విషయాలను ఉటంకిస్తూ మీడియా నివేదికలు తెలిపాయి. కొత్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం దాడిని ధృవీకరించారు. దాడి చేసినవారు దేవాలయాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. అయితే ఈ దాడుల్లో ఆలయాలకు చాలా తక్కువ నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు.

బంగ్లాదేశ్ మైనారిటీలందరికీ రక్షణ కల్పించాలి

బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న విపరీతమైన హింసాత్మక సంఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్, మైనారిటీలందరినీ రక్షించే బాధ్యతను తాత్కాలిక ప్రభుత్వం నెరవేర్చాలని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌కు సంబంధించిన కేసు విషయంలో న్యాయంగా, పారదర్శకంగా వ్యవహరిస్తుందని భారతదేశం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను భారత్ తీవ్రంగా పరిగణించిందని, మైనారిటీలతో సహా పౌరులందరి జీవితాలను, స్వేచ్ఛను కాపాడడం బంగ్లాదేశ్ ప్రాథమిక బాధ్యత అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటుకు తెలిపారు.

భారతదేశం- బంగ్లాదేశ్ మధ్య సంబంధాలలో ఉద్రిక్తత

ఆగస్టులో బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం మధ్య షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ దేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మైనారిటీలతో సహా బంగ్లాదేశ్ పౌరులందరి జీవితం, స్వేచ్ఛను రక్షించడం బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని జైశంకర్ అన్నారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు సంబంధించిన పరిస్థితులను ఢాకాలోని భారత హైకమిషన్ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.

మైనారిటీలకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చిన విదేశాంగ శాఖ ..

మైనారిటీల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అరెస్టయిన చిన్మోయ్ కృష్ణ దాస్‌కు సంబంధించిన కేసును న్యాయంగా, పారదర్శకంగా పరిష్కరించగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీలపై బెదిరింపులు, లక్ష్య దాడుల అంశం విషయంలో భారతదేశం బలంగా లేవనెత్తిందని బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఈ అంశాలను మాట్లాడిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..