AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బలూచిస్తాన్‌లోని మంగోచార్ నగరం.. పాకిస్తాన్ చేతుల్లోంచి జారిపోయిందా?

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మంగోచార్ పట్టణాన్ని బలూచి తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులో భద్రతా సవాళ్లను పెంచుతోంది. ప్రాంతీయ స్థిరత్వానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది.

బలూచిస్తాన్‌లోని మంగోచార్ నగరం.. పాకిస్తాన్ చేతుల్లోంచి జారిపోయిందా?
Bluch Pakistan
Balaraju Goud
|

Updated on: May 03, 2025 | 8:17 PM

Share

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కీలక పరిణామం జరిగింది. పాకిస్తాన్‌లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణంలోని అనేక భవనాలను బలూచ్ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు, కథనాల ప్రకారం, తిరుగుబాటుదారులు నగరంలోని ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలుస్తోంది.

పాకిస్తాన్ సైన్యం, బలూచ్ యోధుల మధ్య భారీ కాల్పులు జరిగాయని, తిరుగుబాటుదారులు ఒక సైనిక శిబిరంపై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని కథనాలు వెలువడ్డాయి. భారతదేశం నుండి సైనిక చర్య సాధ్యమవుతుందని ఊహించి పాకిస్తాన్ తన పశ్చిమ సరిహద్దులలో తన సైనిక మోహరింపును పెంచిన సమయంలో ఈ పరిణామం జరిగింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య దౌత్య సంబంధాలు మరింత క్షీణించాయి.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), ఇతర తిరుగుబాటు గ్రూపులు గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ భద్రతా దళాలపై నిరంతరం దాడులు చేస్తున్నాయి. ఈక్రమంలోనే బలూచిస్తాన్‌లోని మంగోచార్ పట్టణాన్ని బలూచ్ తిరుగుబాటుదారులు ఆక్రమించుకోవడం పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లో పెరుగుతున్న సంక్షోభం ఇస్లామాబాద్‌కు తీవ్రమైన అంతర్గత భద్రతా సవాలుగా మారాయి. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య, ఈ పరిణామం ప్రాంతీయ స్థిరత్వంపై కొత్త ఆందోళనలను లేవనెత్తుతోంది.

ఏప్రిల్ 26న, బలూచిస్తాన్‌లో జరిగిన IED పేలుడులో 10 మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారు. దీనికి BLA బాధ్యత వహించింది. ఈ సంవత్సరం మార్చిలో, బలూచ్ లిబరేషన్ ఆర్మీ 380 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసింది. దీని తరువాత, పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బోలాన్‌ను ప్రారంభించింది. ఇందులో ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 64 మంది మరణించారు. అయితే, BLA ఈ వాదనను తిరస్కరించింది. 50 మంది సైనికులు, 214 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

ఏప్రిల్ 22న భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వివాదాస్పద హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఈ దాడి జరగడం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..