Corona Virus: యూకేని వణికిస్తున్న కొత్త వేరియంట్ ఏవై.4.2.. రష్యా, ఇజ్రాయెల్ ల్లో కూడా కేసులు నమోదు
Corona Virus: సుమారు రెండేళ్ళ క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాల్లో సృష్టించిన కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాలను..
Corona Virus: సుమారు రెండేళ్ళ క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాల్లో సృష్టించిన కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాలను సంతరించుకుని మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కొనసాగుతుండగా.. ఒకటి రెండు దేశాల్లో ఫోర్త్ వేవ్ వచ్చే అవకశాలు ఉన్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చాలా దేశాలు కరోనా కట్టడి కోసం నిబంధనలు విదిస్తూనే .. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశారు. ఇక తాజాగా కరోనా వైరస్ లో కొత్తరకం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ లో ఒక వేరియంట్ డెల్టా వేరియెంట్.. ఇపుడు దీని ఉపవర్గమైన ఏవై.4.2 యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్‌ల సమ్మేళనంగా ఏవై.4.2పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ యుకేని వణికిస్తుంది. ఈ వేరియెంట్ తొలి సారిగా జూలైలో యూకేలో బయటపడింది.
ఇదే వేరియెంట్ కేసులు అగ్రరాజ్యం అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా నమోదవుతున్నాయి. డెల్టా వేరియెంట్ వెలుగులోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకూ 55 సార్లు జన్యుపరమైన మార్పులు చేసుకుంది. అయితే ఇప్పటివరకూ అవి పెద్దగా ప్రభావం చూపలేదు.. కానీ ఇప్పుడు ఏవై.4.2 వేగంగా వ్యాప్తి చెందుతోంది.
రష్యాలో పెరుగుతున్న కరోనా కొత్త కేసులు: రష్యాలో తగ్గినట్లు తగ్గే మళ్ళీ భారీగా రికార్డు స్థాయిలో కరోనా మరణాలు, కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 37,141 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా తో గడచిన 24 గంటల్లో 1,064 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకూ యూరప్‌లోనే అత్యధికంగా రష్యాలో 2,28,453 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో రష్యా అధ్యక్షుడు వేతనంతో కూడిన వారం రోజులు సెలవుని ఇచ్చారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులతో ప్రజా రవాణా వ్యవస్థను కూడా బంద్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే రాజధాని మాస్కోలోని స్కూళ్లు, సినిమా హాళ్లు, వినోద ప్రదేశాలు, స్టోర్లను ఈనెల 28 నుంచి ముసివేయనున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
యుకే లో భారీగా కేసులు: బ్రిటన్‌లో రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 10 రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,009 కేసులు నమోదయ్యాయి. జూలై 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో 96 శాతం ఏవై.4.2 వేరియంట్‌వేనని గుర్తించారు. దీంతో అక్కడ ప్రజల్లో భయందోళనలు నెలకొన్నాయి.
అగ్రరాజ్యం అమెరికాలో ఓ వైపు కరోనా కేసులు.. మరోవైపు ఇతర వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో అమెరికా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగవంతం చేసింది. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ చిన్న పిల్లలకు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే 12 ఏళ్ల పైబడిన వారికి అమెరికాలో టీకాలు ఇస్తున్నారు. ఇక నవంబర్ నుంచి 5 నుంచి 11 ఏళ్ల వయసు వారికి టీకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. క్రిస్మస్ పండుగ నాటికి కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి జో బైడెన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.