Sri Ramana Maharshi: భగవంతుడి వద్దకు నిర్మల భక్తితో వెళ్ళాలి.. కోరికలతో ఎన్ని గిఫ్ట్‌లు ఇచ్చినా నిష్పలం అంటున్న రమణ మహర్షి
Sri Ramana Maharshi: మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం. మానవులకు జీవితపు విలువ, ముక్తి మార్గం చూపే దీపపు స్థంభాలు మహర్షులు. మానవులుగా పుట్టి..
Sri Ramana Maharshi: మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం. మానవులకు జీవితపు విలువ, ముక్తి మార్గం చూపే దీపపు స్థంభాలు మహర్షులు. మానవులుగా పుట్టి పూర్వజన్మ పుణ్యం వలన కర్మ చేత మహరుషులుగా పూజలను అందుకుంటారు. అలాంటివారిలో ఒకరు భగవాన్ శ్రీ రమణ మహర్షి. భారతదేశ చరిత్రలో 20వ శతాబ్దంలో ప్రపంచ ఖ్యాతి గాంచిన వారిలో భగవాన్ రమణ మహర్షి ఒకరు. శ్రీ రమణ మహర్షి బోధనల్లో ముఖ్యమైంది “మౌనం” లేదా “మౌనముద్ర”. రమణ మహర్షి తక్కువగా ప్రసంగించేవారు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. రమణ మహర్షి ఆత్మజ్ఞానం గురించి ప్రధానంగా భోధించేవారు. ఎవరైనా ఉపదేశించమని కోరితే, “స్వీయ శోధన” ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవారు. అతని అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవారు.
ఒకసారి శ్రీ రమణుల ముందు ఒక పెద్దమనిషి నిందగా భగవాన్ తో ఇలా సంభోధించారు … “భగవాన్ ! మీరు పశుపక్షుల మీద, పిల్లుల మీద, దిక్కుమాలిన దరిద్రుల మీద ఎంతో ఆదరణ చూపిస్తారు. కావాలని వాళ్ళని పలకరిస్తారు, లాలిస్తారు, చేతుల మీద వారికి తినిపిస్తారు, మేము మీ చూపు కోసం, మాట కోసం, మీ చేతి నుండి ప్రసాదం కోసం ఎంత తపించిపోతున్నా, ప్రాధేయపడినా, ప్రార్ధించినా మా వంకే చూడరు… ఇది మీకు న్యాయమేనా? మీ సమత్వానికి భంగం కాదా? ” అని నిష్టూరంగా మాట్లాడాడు.
దీంతో రమణ మహర్షి భగవాన్ పెదవులపై చిరునవ్వుతో తొణికిసలాడింది. కొద్దిసేపు మౌనం వహించారు.. తర్వాత మృదువుగా “అదా ! మీ సందేహం! ఆ పశువులు, పక్షులు, పిల్లులు, అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తారు… ఏ కాంక్షలు, కోరికలు వారికి ఉండవు.. అందువల్ల నేను వారిని అత్యంత సహజంగా ప్రేమిస్తాను… అట్లా సహజంగా ప్రవర్తించడం నాకిష్టం, ఇంకా పెద్దలు ఎన్నో కోరికలతో, కాపీనాలతో ఇక్కడ నుండి ఏదో పట్టకుపోవాలనే కాంక్షతో వస్తారు. దానికోసం కావాలని భక్తిని తెచ్చి పెట్టుకుంటారు, ఇవన్నీ వేషాలు, మాత్రమే ఇవి భగవంతుణ్ణి ఏమార్చలేవు” అన్నారు.
నా అంతటి భక్తుడు లేడని, పెద్ద దండో, పూలో, ఫలాలో బుట్టలనిండా తెస్తారు, ఇవి అవసరమా.. నిర్మలమైన భక్తి ఒక్కటి చాలదా! నీ గూర్చి తెలిసిన భగవంతునికి, నీ మనసులో ఏముందో తెలియదా.. ఇలా నటన భక్తికి భగవంతుడు ఎలా దాసుడవుతాడు, భక్తుడు ఎప్పుడూ నిర్మలమైన మనసుతో ఉండాలి. ఇప్పుడు చెప్పు భగవంతుడు ఎవరికి దాసుడు, ఎవరిని ఇష్టపడాలని రమణ మహర్షి చెప్పారు.
Also Read: డెన్మార్క్ ఓపెన్ టూర్ నుంచి సింధు ఔట్.. క్వార్టర్ ఫైనల్‌లో ఆన్ సెయంగ్ చేతిలో ఓటమి..