Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. తాలిబన్ల దురగతాలు తట్టుకోలేక.. అక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్గన్ ప్రజలు భారీ సంఖ్యలో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అక్కడికి వచ్చే విదేశాలకు చెందిన విమానాల్లో ఎక్కి ప్రాణాలు దక్కించుకుంటున్నారు. అమెరికాకు చెందిన మిలటరీ విమానాలు పెద్ద ఎత్తున ఆఫ్గన్ శరణార్థులను తరలిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆఫ్గన్‌కు చెందిన ఓ నిండు గర్భిణి కూడా అమెరికా మిలటరీ విమానం ఎక్కింది.
కాబూల్ నుంచి జర్మనీ వెళ్తుండగా.. విమానం ప్రయాణ మార్గంలోనే ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, విమాన ప్రయాణంలో వాతావరణంలో ఒత్తిడి తగ్గడంతో బాధిత మహిళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దాంతో అలర్ట్ అయిన పైలట్.. విమానం ఎత్తును తగ్గించి వాతావరణంలో ఒత్తిడిని బ్యాలెన్స్ చేశారు. ఎమర్జెన్సీ కావడంతో.. జర్మనీలోని రామ్‌స్టీన్ ఎయిర్‌బేస్ వద్ద విమానాన్ని దించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు అమెరికన్ ఆర్మీ వెల్లడించింది.
Also read:
కాబూల్ విమానాశ్రయం నుంచి 107 మంది భారతీయుల తరలింపు..ఢిల్లీ చేరిన ఇండిగో, ఎయిరిండియా విమానాలు
Tamilnadu: తమిళనాడులో 1 నుంచి మళ్ళీ స్కూళ్ళు.. రేపటి నుంచి సినీ థియేటర్లకు అనుమతి