Afghanistan: మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు.. వాహనాలు నడిపి తీరుతామంటున్న యువతులు.. ఎక్కడంటే?
నిన్నటి దాకా మహిళల చదువు, ఉద్యోగాలపై ఆంక్షలు పెట్టిన తాలిబర్లు ఇప్పుడు వారికి డ్రైవింగ్ లైసెన్స్ నిరాకరిస్తున్నారు. అయినా డ్రైవింగ్ చేసి తీరుతామంటున్నారు అక్కడి యువతులు.
Afghanistan Taliban Government: నిన్నటి దాకా మహిళల చదువు, ఉద్యోగాలపై ఆంక్షలు పెట్టిన తాలిబర్లు ఇప్పుడు వారికి డ్రైవింగ్ లైసెన్స్ నిరాకరిస్తున్నారు. అయినా డ్రైవింగ్ చేసి తీరుతామంటున్నారు అక్కడి యువతులు. మొన్న మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించారు.. నిన్న ఆడ పిల్లలకు చదువు వద్దంటూ కాలేజీలు, స్కూల్స్ మూయించారు.. ఇప్పుడు మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు అంటున్నారు.. ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి.. మహిళలకు వాహనాలు నడిపేందుకు లైసెన్స్‌లను ఇవ్వొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.. ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి మహిళలు తప్పు పడుతున్నారు..
మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయొద్దని ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఇప్పటికే మౌళిక ఆదేశాలు జారీ అయ్యాయి.. అలాగే శిక్షణ కూడా ఇవ్వొద్దని డ్రైవింగ్ స్కూళ్లను కూడా హెచ్చరిస్తున్నారు తాలిబన్లు.. ఆఫ్ఘన్‌లో కాస్త ప్రగతి శీల నగరంగా పేరున్న హెరాత్‌లో ఎంతో మంది మహిళలు వాహనాలను నడిపిస్తారు.. తాము డ్రైవింగ్ చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.
పురుష డ్రైవర్లు నడిపే వాహనంకన్నా , సొంతంగా వాహనాన్ని నడిపించడం తమకు భద్రతగా ఉంటుందని అక్కడి మహిళలు చెబుతున్నారు. ప్రభుత్వం కొత్తగా లైసెన్స్‌ల జారీని నిషేధించినా, ఇప్పటికే అనుమతి పొందిన తాము వాహనాలను నడిపిస్తామని వారు చెబుతున్నారు.. భర్తలు, సోదరులు, తండ్రులను ఇబ్బంది పెట్టకుండా తామే స్వయంగా వాహనంలో వెళ్లి షాపింగ్ చేసుకుంటే తప్పేమిటంటున్నారు. ఇప్పటి వరకైతే డ్రైవింగ్ చేయొద్దని తమను ఎవరూ ఆదేశించలేదని హెరాత్‌లోని మహిళలు చెబుతున్నారు..