Afghanistan crisis: ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్‌షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ సర్కార్‌కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఇప్పటికే ముల్లా హబీదుల్లాను సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వ నేతగా వ్యవహరించనున్నారు. కాగా, పంజ్‌షేర్ కూడా తమ వశమైందని తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆనందోత్సాహాలతో తాలిబన్లు నిన్న రాత్రికాబూల్‌లోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో చిన్నారులు సహా పలువురు మృతిచెందారని, భారీ సంఖ్యలో గాయపడ్డారని అస్వాకా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. గాయపడినవారిని స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారని తెలిపింది.
అయితే, పంజ్‌షేర్ లోయను కూడా ఆక్రమించామన్న తాలిబన్ల ప్రకటనను నార్తర్న్ అలయెన్స్ బలగాలు ఖండించాయి. పంజ్‌షేర్‌పై దాడికి దిగిన తాలిబన్ దళాలపై నార్తర్న్ అలయెన్స్ బలగాలు ఎదురుదాడికి దిగాయి, ముష్కరమూకలపై తూటాల వర్షం కురిపించాయి. దీంతో తాలిబన్లు తోకముడుచుకుని వెనుదిరగక తప్పలేదు. ఈ పోరులో తాలిబన్లకు భారీ ప్రాణనష్టం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
పంజ్‌షేర్ వ్యాలీలో తాలబన్లకు, నార్తర్న్ అలయెన్స్‌కు మధ్య భీకర పోరు జరిగింది. తమ దాడుల్లో 450 మంది తాలిబన్లు హతమైనట్టు రెసిస్టెంట్ ఫోర్స్ ప్రకటించింది. పంజ్‌షేర్ లోయ లోకి ప్రవేశిస్తున్న తాలిబన్ల ట్యాంకులను నార్తర్న్ అలయెన్స్ బలగాలు పేల్చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. పంజ్‌షేర్‌పై పట్టు సాధిస్తునట్టు తాలిబన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని , వాళ్లు ఒక్క అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేదని నార్తర్న్ అలయెన్స్ ప్రకటించింది.
ఆఫ్ఘానిస్తాన్ మొత్తం తమ గుప్పిట్లో ఉన్నప్పటికి .. పంజ్‌షేర్ లోయ ఇంకా తమ ఆధీనం లోకి రాకపోవడాన్ని తాలిబన్లు జీర్ణించుకోలేకపోయారు. నార్తర్న్ అలయెన్స్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారితో భీకరపోరుకు దిగారు. తాలిబన్లకు అల్‌ఖైదా, ఐఎస్‌ఐ కూడా సాయం చేసినట్టు తెలుస్తోంది. తిరుగుబాటుదారులతో జరిపిన పోరులో విజయం సాధించామని, పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. కాబూల్‌లో సంబరాలు చేసుకున్నారు. అయితే నార్తర్న్ అలయెన్స్ నేత అమ్రుల్లా సలేహ్ మాత్రం పంజ్‌షీర్ ఇంకా తమ ఆధీనంలోనే ఉందని చెబుతున్నారు. తాలిబన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.