కొంతమంది పిల్లలు నెలలు నిండకుండా పుట్టి చనిపోతారు. అయితే ఇలాంటి మరణాలు 91 శాతం అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ల నివేదిక వెల్లడించింది. ఇందుకు ప్రధాన కారణం వాయుకాలుష్యమేనని పేర్కొంది. వాతావరణ మార్పులు, శిశువల ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని ఈ నివేదిక తెలియజేసింది. శిశువుల జననాలు, వారి ఆరోగ్యంపై వేడిగాలులు, వరదలు, కరవులు, తుపానులు, కార్చిచ్చులు, వాయుకాలుష్యం మొదలైన వాటి వల్ల వాతావరణ మార్పులు ప్రభావం చూపుతాయని తెలిపింది. అయితే ఈ పరిస్థితిని మార్చాలంటే ఆర్థిక వనరుల అవసరం చాలానే ఉంటుందని ఈ నివేదిక తెలిపింది.
బరువు తక్కువున్న శిశువుల్లో 15.6 శాతం మరణాలు, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో 35.7 శాతం మరణాలకు ఇళ్లల్లో పెరుగుతున్న వాయుకాలుష్యమేనని పేర్కొంది. గాంబియాలో జరిపిన పరిశోధన ప్రకారం.. ప్రతి ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరగడంతో పిండంపై 17 శాతం అధికంగా ఒత్తిడి పడుతోందని తెలిపింది. భారత్‌లో కూడా పర్యావరణ మార్పుల బారిన పడుతున్న జిల్లాల్లో బాలింతలు, శిశువుల ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటోందని వెల్లడించింది. అయితే పర్యావరణ మార్పులు అనేవి బాలింతలు, శిశువులపై దుష్పరిణామాలను చూపిస్తున్నాయని.. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు వెంటనే మహిళలు, సామాజిక సంస్థలతో చర్చలు ప్రారంభించాలని డబ్ల్యూహెచ్‌వోకు చెందిన డాక్టర్ అన్షు బెనర్జీ సూచించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..