Turtle Meat: సముద్రం తాబేలు మాంసం తిని తొమ్మిది మంది మృత్యువాత.. 78 మందికి సీరియస్!
తూర్పు ఆఫ్రికాలోని జాంజిబార్ ద్వీపసమూహంలో సముద్రపు తాబేలు మాంసాన్ని జాంజిబార్ ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. వారు తాబేలు మాంసం రుచికరమైనదిగా పరిగణిస్తారు. అందుకే అక్కడి తాబేలు మాంసానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు కచ్చితంగా తాబేలు మాంసం రుచి చూస్తారు కూడా. తాజాగా ఇక్కడి పెంబా ద్వీపంలో సముద్ర తాబేలు మాంసం తిని తొమ్మిది మంది మృతి చెందారు..

జాంజిబార్, మార్చి 11: తూర్పు ఆఫ్రికాలోని జాంజిబార్ ద్వీపసమూహంలో సముద్రపు తాబేలు మాంసాన్ని జాంజిబార్ ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. వారు తాబేలు మాంసం రుచికరమైనదిగా పరిగణిస్తారు. అందుకే అక్కడి తాబేలు మాంసానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు కచ్చితంగా తాబేలు మాంసం రుచి చూస్తారు కూడా. తాజాగా ఇక్కడి పెంబా ద్వీపంలో సముద్ర తాబేలు మాంసం తిని తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. మరో 78 మంది తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు అధికారులు మీడియాకు తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం (మార్చి 8) నాడు 8 మంది పిల్లలు మరణించగా.. శనివారం మరో మహిళ మృతి చెందింది. మరణించిన మహిళ శుక్రవారం మరణించిన పిల్లల్లో ఒకరికి తల్లి అని Mkoani జిల్లా వైద్య అధికారి డాక్టర్ హాజీ బకారి తెలిపారు. వారంతా గత మంగళవారం (మార్చి 5) సముద్రం తాబేలు మాంసాన్ని తిన్నట్లు తెలుస్తోంది.
మృతులతోపాటు, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి శాంపిల్స్ పరీక్షించగా తాబేలు మాంసం కారణంగానే ఈ దారుణం చోటు చేసుకున్నట్లు ల్యాబ్ రిపోర్టు వెల్లడించింది. డాక్టర్ బకారీ మీడియాతో మాట్లాడుతూ బాధితులందరూ సముద్ర తాబేలు మాంసాన్ని తిన్నట్లు ల్యాబ్ రిపోర్టులు నిర్ధారించాయని చెప్పారు. దీంతో అప్రమత్తమైన తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సెమీ అటానమస్ ప్రాంతమైన జాంజిబార్‌లోని అధికారులు హమ్జా హసన్ జుమా నేతృత్వంలో విపత్తు నిర్వహణ బృందాన్ని పెంబా ద్వీపానికి పంపారు. సముద్ర తాబేళ్లను తినకుండా ఉండమని అక్కడి ప్రజలను కోరారు. కాగా నవంబర్ 2021లోనూ తాబేలు మాంసం తిని పెంబాలో మూడేళ్ల బాలుడితో సహా ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. నిజానికి, తాబేలు మాంసంలో కిలోనిటాక్సియం అనే పదార్థం ఉంటుంది. దీనిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని వైద్యులు అంటున్నారు. తాబేలు మాంసం తిన్న వారు కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




