
అమెరికాలో తెలుగు సంఘం (తానా) మహాసభల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలోనే అతిపెద్ద సంఘంగా పేరొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం రెండు సంవత్సరాలకోసారి ఈ సభలను నిర్వహిస్తుంటుంది. ఈ తానా సభలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలు జులై 3 నుంచి 5వ తేదీ వరకు డెట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షో ప్లేస్‌లో నిర్వహించనున్నారు. 24వ ద్వై వార్షిక మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తానా సన్నాహాలు చేస్తోంది.
తెలుగుదనానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చే తానా.. ఈసారి మహాసభలకు ‘‘తరతరాల తెలుగుదనం – తరలివచ్చే యువతరం’’ అనే నినాదంతో ముందుకు వస్తోంది. తానా సభలు ప్రపంచంలోని తెలుగు కమ్యూనిటీని ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. అమెరికా నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు అమెరికాలోని రాజకీయ ప్రముఖులు, భారత్‌లోని రాజకీయ, సినీ, పలు రంగాల ప్రముఖులు తరలివచ్చి కనువిందు చేస్తుంటారు. ఎప్పటికి గుర్తుండిపోయేలా ఈసారి తానా కన్వెన్షన్ నిర్వహించబోతున్నామని తానా నిర్వాహకులు చెబుతున్నారు.
కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్ల కమిటీలో సహాయ సమన్వయకర్త కోనేరు శ్రీనివాస్, డైరెక్టర్ సునీల్ పాంట్ర, సెక్రటరీ కిరణ్ దుగ్గిరాల, ట్రెజరర్ జోగేశ్వరరావు పెద్దిబోయిన, తానా ఉత్తర ప్రాంతీయ ప్రతినిధి నీలిమ మన్నె, తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపులు ఉన్నారు. సభల ప్రచార కార్యక్రమాలను మార్చి నెల నుంచి ప్రారంభం కానున్నాయి.
అనుకూలమైన వేదిక..
డెట్రాయిట్‌లోనూ దాని చుట్టుప్రక్కల ఎంతోమంది తెలుగువారు నివసిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని వారికీ ఈ ప్రాంతం అనువైనది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు మహాసభలకు వేదికగా డెట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌ను ఎంపిక చేశారు.
తెలుగు వైభవం కనిపించేలా..
ఈ మహాసభల్లో పదహారణాల తెలుగువైభవం కనిపించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు మహాసభల కార్యవర్గం తెలిపింది. ప్రవాసులు ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి