సెంట్రల్ అమెరికా దేశ రాజధాని ఎల్ సాల్వడార్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కస్కట్లాన్ ఫుట్ బాల్ స్టేడియంలో శనివారం (మే 20) రాత్రి తొక్కిసలాట జరిగింది. ప్రేక్షకులు హఠాత్తుగా స్టేడియంలోకి దూసుకురావడంతో ఒకరినొకరు తోసుకుంటూ పరుగులు తీశారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటీన స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సెంట్రల్ అమెరికన్ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
అలియాంజా ఎఫ్‌సీ, క్లబ్ డిపోర్టివో ఎఫ్ఎఎస్ జట్ల మధ్య సెకండ్ లీగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కస్కట్లాన్ స్టేడియంలో 44 వేల మంది మాత్రమే వీక్షించేందుకు అవకాశం ఉంది. ఐతే మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో టోర్నమెంట్ను నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఎల్ శాల్వడార్ ప్రెసిడెంట్ నయీబ్ బుకెలే సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులెవరైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. మరోవైపు కస్కట్లాన్ స్టేడియంలో జరిగిన సంఘటనలకు సాల్వడోరన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కాగా ఏడు నెలల క్రితం ఇండోనేషియాలోని మాలాంగ్‌లో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ తర్వాత జరిగిన తొక్కిసలాటలో 135 మంది మరణించిన సంగతి తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.