Myanmar Landslide: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. మైనింగ్ సైట్‌లో విరిగిపడిన కొండ చరియలు.. 70 మంది గల్లంతు..
మయన్మార్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జాడే (పచ్చరాళ్ల) మైనింగ్ సైట్‌లో కొండచరియలు విరిగిపడడంతో
మయన్మార్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జాడే (పచ్చరాళ్ల) మైనింగ్ సైట్‌లో కొండచరియలు విరిగిపడడంతో ఒకరు మృతిచెందారు. మరో 70 మంది గల్లంతయ్యారు. కాచిన్ రాష్ట్రంలోని హ్పకాంత్ అనే ప్రాంతంలో భారతీయ కాలమానం ప్రకారం తెల్లవారుజాము 4 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనలో అనేక మంది బురదలో చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రెస్క్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా బురదలో గల్లైంతన వారి కోసం విస్తృత గాలింపు చేపడుతున్నారు.
70 నుంచి 100 మంది జాడ తెలియడం లేదు.. ‘ఈ ప్రమాదంలో సుమారు 70- 100 మంది గల్లంతయ్యారు. తీవ్రంగా గాయపడిన 25 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. అందులో ఒకరు చనిపోయారు. గల్లంతైన వారిని కనుగొనేందుకు సుమారు 200 మందితో గాలింపు చేపడుతున్నాం’ అని రెస్క్యూ బృందంలోని కీలక అధికారి చెప్పుకొచ్చారు. కాగా లారీల నుంచి ఉపరితల గనుల్లో వేసిన శిథిలాలు ఓవర్‌ఫ్లో అయి గుట్టలుగా పొంగిపొర్లడంతోనే కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జాడే గనులకు ప్రపంచంలో మయన్నార్ ఎంతో ప్రసిద్ధి. ముఖ్యంగా ప్రస్తుతం ప్రమాదం చోటు చేసుకున్న హ్పకాంత్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద జాడే గనిగా పేరుంది. కానీ ఇక్కడి గనుల్లో చాలా ఏళ్లుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది మృత్యువాత పడ్డారు. అందుకే హ్పకాంత్ ప్రాంతంలో జాడే మైనింగ్‌పై నిషేధం కూడా విధించారు.
గతంలోనూ ప్రమాదాలు.. అయినా.. అయితే ఇక్కడి స్థానికులకు సరైన ఉపాధి అవకాశాలు లేవు. దీనికి తోడు కొవిడ్ పరిస్థితుల కారణంగా వీరి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో వీరు తరచూ నిబంధనలు ఉల్లంఘించి మరీ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. దీనికి తోడు మైనింగ్ వ్యవహారాలకు సంబంధించి వీరికి సరైన అవగాహన, నైపుణ్యం లేవు. అందుకే కొండ చరియలు విరిగినప్పుడల్లా వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా ఇక్కడి కాచిన్ రాష్ట్రంలోని ఓ జాడే మైనింగ్ సైట్‌లో 2015లో కొండచరియలు విరిగిపడి 116 మంది కార్మికులు మృతిచెందారు. ఇక గతేడాది చోటుచేసుకున్న మరో ప్రమాదంలో 160 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దురదృష్టకరమైన విషయమేమిటంటే మృతుల్లో ఎక్కువ మంది మయన్మార్‌కు వలస వచ్చినవారే ఉండడం గమనార్హం. ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని మయన్మార్ ప్రభుత్వం 2018లో కొత్త మైనింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే మైనింగ్ కార్యకలాపాలను అరికట్టడానికి సంబంధిత అధికారులకు పరిమితంగా మాత్రమే అధికారమిచ్చింది. దీనికి తోడు సిబ్బంది లేమితో చట్ట విరుద్ధంగా జరిగే మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్టపడడం లేదని అధికారులు చెబుతున్నారు.
Also Read:
Plane Crash: పారా గ్లైడర్‌ను ఢీకొని కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి..
Viral Video: తెగిన పారాచూట్ తాడు.. సముద్రంలో పడిపోయిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే..
Viral video: రణ్‌బీర్ పాటకు స్టెప్పులేసిన వరుడు.. పెళ్లి కూతురు రియాక్షన్ చూసి..