Telangana: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్

తెలకపల్లి మండలం తాళ్లపల్లి శివారు పంట పొలాల్లో క్షుద్ర పూజల కలకలం రేగింది. పచ్చని పత్తి పంటలో కాష్మోరా సినిమాను తలపించే రీతిలో క్షుద్ర పూజల అంత్ర తంత్రాలు చేయడంతో స్థానిక రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.

Follow us

|

Updated on: Nov 04, 2024 | 1:18 PM

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం తాళ్లపల్లిలో క్షుద్రపూజల కుతంత్రాలు స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. దాయాదుల మధ్య నెలకొన్ని భూతగాదాలే ఇందుకు కారణంగా స్థానికులు చర్చించుకుంటున్నారు. తాళ్లపల్లికి చెందిన చాకలి తిరుపతయ్య అనే రైతుకు చెందిన పత్తి పంటలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ క్షుద్ర పూజలకు పాల్పడ్డారు. పంట పొలంలో కుంకుమ, పసుపు, సున్నంతో పాటు మరికొన్ని రంగులతో రౌండ్‌గా కొంత ఏరియాలో పటం వేశారు. అందులో వివిధ రకాల వస్త్రాలతో దిష్టిబొమ్మలు తయారు చేసి ఆ పటం మధ్యలో ఉంచారు. అలాగే శనగ పిండితో బొమ్మను తయారు చేసి రంగుల పటం మధ్యలో ఉంచి ఇనుప మేకులు పొడిచారు. చుట్టుప్రక్కల బయట ప్రాంతంలో నాలుగు చీలలను భూమిలో పాతి పిండితో చేసిన బొమ్మకు వివిధ రకాల బట్ట పీలికలను కట్టి ఉంచారు. టెంకాయలను కొట్టి నిమ్మకాయలు కోసి మధ్యలో ఉంచారు. ఎండు కొబ్బరి గిన్నెలను పటం నలువైపులా ఉంచి వత్తులను వేసి దీపాలు వెలిగించారు.

ఆ తర్వాత అర్ధరాత్రి సమయాన పూజలు చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. రైతు రెండు రోజుల తర్వాత పంట పొలానికి వెళ్లి చూడగా ఈ దృశ్యం కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. స్థానిక చుట్టుప్రక్కల రైతులను పిలిపించి చూపించారు. ఈ దృశ్యాన్ని చూసిన అందరూ నివ్వెరపోయారు. ఈ సంఘటన మొత్తాన్ని గ్రామ పెద్ద మనుషులకు, స్థానిక రైతులకు చెప్పారు. తనకు గిట్టని వారే ఈ పని చేసి ఉంటారని వారికి మొరపెట్టుకున్నారు. బాధిత రైతు తిరుపతయ్య తన దాయాదులపై తెలకపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో నుంచి మా మధ్యన వివాదాలు ఉన్నాయని, ఈ క్షుద్ర పూజలకు అతనే కారకుడని పేర్కొన్నాడు సదరు బాధితుడు.