AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100, 200, 500 నోట్లపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా..? దీన్ని వెనక పెద్ద కథే ఉందిగా..

కరెన్సీ నోటు చేతిలోకి రాగానే మనం గాంధీ బొమ్మ లేదా నోటు నంబర్లను చూస్తాం. కానీ దృష్టి లోపం ఉన్నవారు లేదా కంటిచూపు లేనివారు ఆ నోటు వంద రూపాయలదా, ఐదు వందల రూపాయలదా అని ఎలా గుర్తుపడతారో ఎప్పుడైనా ఆలోచించారా? వారి కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లపై ఒక అద్భుతమైన ఫీచర్‌ను డిజైన్ చేసింది. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

100, 200, 500 నోట్లపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా..? దీన్ని వెనక పెద్ద కథే ఉందిగా..
Why Do Currency Notes Have Lines On Edges
Krishna S
|

Updated on: Jun 14, 2026 | 6:36 PM

Share

మనం ప్రతిరోజూ ఎన్నో సార్లు కరెన్సీ నోట్లను చూస్తుంటాం.. వాడుతుంటాం. కానీ నిత్యం మన కళ్లముందే ఉండే కొన్ని ముఖ్యమైన విషయాలపై పెద్దగా శ్రద్ధ పెట్టము. ఏదైనా అరుదైనది చూసినప్పుడు మాత్రమే దాని గురించి తెలుసుకోవడానికి ఆరాటపడతాం. అదే విధంగా మీ జేబులో లేదా పర్సులో ఉండే కరెన్సీ నోట్లను ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా గమనించారా? వెంటనే మీ పర్సులోంచి ఒక 100, 200 లేదా 500 రూపాయల నోటు బయటకు తీయండి. ఆ నోటుకు ఎడమ, కుడి అంచులను నిమరడమో లేదా చూడడమో చేయండి. అక్కడ మీకు కొన్ని ఏటవాలు గీతలు కనిపిస్తాయి. బహుశా వీటిని మీరు ఇంతకు ముందెన్నడూ గమనించి ఉండరు. అసలు నోట్లపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో, ఏ నోటుకు ఎన్ని గీతలు ఉంటాయో చాలా మందికి తెలియదు.

ఈ ఏటవాలు గీతలను ఏమంటారు?

కరెన్సీ నోట్ల అంచున ఉండే ఈ ఏటవాలు గీతలను సైన్స్ లేదా బ్యాంకింగ్ భాషలో బ్లీడ్ మార్క్స్ లేదా విజువల్ కోడ్స్ అంటారు. ఇవి సాధారణ ప్రింటింగ్ లాగా ఫ్లాట్‌గా ఉండవు. నోటుపై వీటిని కొద్దిగా ఉబ్బెత్తుగా ప్రింట్ చేస్తారు. అంటే వీటిపై చేత్తో ముట్టుకుంటే ఆ గీతలను మనం స్పష్టంగా స్పర్శ ద్వారా గుర్తుపట్టవచ్చు.

ఈ గీతల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ గీతలను కేవలం డిజైన్ కోసం ఏర్పాటు చేయలేదు. దీని వెనుక ఒక గొప్ప సామాజిక ఉద్దేశం ఉంది. కంటిచూపు లేనివారు లేదా దృష్టి లోపం ఉన్నవారు.. కరెన్సీ నోట్లను కేవలం చేత్తో తాకి, అవి ఏ నోటో పక్కాగా గుర్తించడం కోసం ఈ బ్లీడ్ మార్క్స్‌ను డిజైన్ చేశారు. ఆ గీతల సంఖ్య, ఆకారాన్ని బట్టి అది వంద నోటా, ఐదు వందల నోటా అనేది వారు క్షణాల్లో కనిపెట్టేస్తారు.

ఏ నోటుపై ఎన్ని గీతలు ఉంటాయి?

రూ.100 నోటు: వంద రూపాయల నోటుకు ఇరువైపులా 4 ఏటవాలు గీతలు ఉంటాయి.

రూ.200 నోటు: రెండు వందల రూపాయల నోటుకు ఇరువైపులా 4 ఏటవాలు గీతలు ఉంటాయి.. కానీ వాటి మధ్యలో రెండు చిన్న వృత్తాలు లేదా సున్నాలు ఉంటాయి.

రూ.500 నోటు: ఐదు వందల రూపాయల నోటుకు ఇరువైపులా 5 ఏటవాలు గీతలు ఉంటాయి.

దృష్టి లోపం ఉన్నవారి కోసం మరికొన్ని ప్రత్యేక చిహ్నాలు..

ఈ బ్లీడ్ మార్క్స్‌తో పాటు నోటుకు ఎడమ వైపున సింహాల గుర్తు పైన ఒక ప్రత్యేకమైన జియోమ్యాట్రిక్ షేప్ ఉబ్బెత్తుగా ప్రింట్ అయి ఉంటుంది. అందులో నోటు విలువ నంబర్ రూపంలో ఉంటుంది. కంటిచూపు లేనివారు దీనిని తాకి కూడా నోటును గుర్తిస్తారు.

రూ.100 నోటుపై: త్రిభుజం ఆకారం ఉంటుంది.

రూ.200 నోటుపై: హెచ్ అక్షరం ఆకారం ఉంటుంది.

రూ.500 నోటుపై: వృత్తం ఆకారం ఉంటుంది.

నోటు అసలైందా, నకిలీదా అని చెప్పే సెక్యూరిటీ థ్రెడ్

మనం చూసే మెరిసే గీత నోటు మధ్యలో నిలువుగా ఉంటుంది. దీనిపై భారత్, ఆర్బీఐ అని రాసి ఉంటుంది. నోటును కొద్దిగా వంచినప్పుడు ఈ గీత రంగు ఆకుపచ్చ నుండి నీలిరంగులోకి మారుతుంది. ఇది నోటు నకిలీదో కాదో చెప్పే అతి పెద్ద ఫీచర్.

కరెన్సీ నోట్లపై ఉండే ఈ చిన్న గీతల వెనుక ఇంత పెద్ద సాంకేతికత, సమాజంపై బాధ్యత దాగి ఉన్నాయి. ఇకపై ఎప్పుడైనా కరెన్సీ నోటు చేతిలోకి రాగానే కేవలం బొమ్మలనే కాకుండా సమాజంలోని అందరికీ ఉపయోగపడేలా ఆర్‌బీఐ రూపొందించిన ఈ అద్భుతమైన ఫీచర్లను కూడా ఒకసారి గమనించండి.

Follow Us