AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి విడ్డూరం సామీ.. పెళ్లికూతురు పళ్లు రాలగొడితేనే పెళ్లి.. అసలు కథ తెలిస్తే అవాక్కే..

చైనా, వియత్నాం సరిహద్దుల్లోని గెలావో తెగలో పెళ్లికి ముందు వధువు ముందు పళ్లను తొలగించడం వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఓ వింత సంప్రదాయం. వధువు పళ్లు వరుడి కుటుంబానికి కీడు తెస్తాయని, వంశాభివృద్ధికి అడ్డుగా నిలుస్తాయని వారి నమ్మకం. ఈ ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తూ వధువు అత్తగారు లేదా బంధువులు కత్తితో పళ్లను విరగ్గొడతారు.

ఇదెక్కడి విడ్డూరం సామీ.. పెళ్లికూతురు పళ్లు రాలగొడితేనే పెళ్లి.. అసలు కథ తెలిస్తే అవాక్కే..
Gelao Tribe Marriage Rituals
Krishna S
|

Updated on: Dec 22, 2025 | 8:28 PM

Share

సాధారణంగా పెళ్లి అంటే వధువును రకరకాల నగలు, మేకప్‌తో మరింత అందంగా ముస్తాబు చేస్తారు. కానీ ఒక తెగలో మాత్రం పెళ్లికి ముందు వధువు ముందు పళ్లను ఊడగొడతారు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. చైనా, వియత్నాం సరిహద్దుల్లో నివసించే గెలావో తెగలో ఈ వింత ఆచారం నేటికీ కనిపిస్తుంది.

పళ్లు ఎందుకు విరగ్గొడతారు?

గెలావో తెగ నమ్మకం ప్రకారం.. వధువుకు పై వరుసలో ముందు పళ్లు ఉంటే అది వరుడి కుటుంబానికి కీడు కలిగిస్తుందని నమ్ముతారు. వధువు దంతాలు విరగకపోతే వరుడి వంశాభివృద్ధి ఆగిపోతుందని, కుటుంబానికి ఏదో ఒక ఆపద సంభవిస్తుందని వారు బలంగా నమ్ముతారు. అందుకే వివాహ వేడుకలో భాగంగా వధువు రెండు ముందు పళ్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తారు.

1127 నుంచే ఈ సంప్రదాయం!

ఈ ఆచారానికి సంబంధించిన ఆధారాలు క్రీస్తుశకం 1127 నాటి నుంచే ఉన్నాయి. ఒక జానపద కథ ప్రకారం.. పూర్వం ఒక గెలావో మహిళ అడవిలో పండ్లు సేకరిస్తుండగా కొండపై నుంచి పడిపోయిందట. ఆ ప్రమాదంలో ఆమె ముందు పళ్లు విరిగిపోయాయి. అప్పటి నుంచి ఆమె తెగ పట్ల చూపిన అంకితభావానికి గుర్తుగా వివాహానికి ముందు వధువు పళ్లు తొలగించే పద్ధతి మొదలైందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

కత్తితో పళ్లు విరిచే వేడుక

ఈ ఆచారం ఒక క్రతువులా జరుగుతుంది.. వధువు అత్తగారు ఒక చిన్న కత్తితో వధువు ముందు పళ్లను విరగ్గొడతారు. అత్తగారు లేని పక్షంలో తల్లి తరపు మగ బంధువు ఈ పని చేస్తారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వైన్ తయారు చేసి అతిథులకు అందిస్తారు. పళ్లు విరిచిన తర్వాత నొప్పి తగ్గడాని, రక్తస్రావం ఆపడానికి చిగుళ్లకు ఒక ప్రత్యేకమైన ఔషధ పొడిని పూస్తారు.

కుక్క దంతాలు

పళ్లు విరిచిన తర్వాత అందం దెబ్బతినకుండా ఉండేందుకు కొన్ని సందర్భాల్లో ఆ ఖాళీ ప్రదేశంలో కుక్క దంతాలను అమర్చుతారట. దీనివల్ల వధువు అందం పెరుగుతుందని వారి నమ్మకం. ఈ ఆచారాన్ని పాటించని మహిళలను ఆ సమాజం అపహాస్యం చేస్తుంది.

ఎవరీ గెలావో ప్రజలు?

వీరు ప్రధానంగా దక్షిణ చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లో నివసిస్తారు. వీరు పర్వత ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటారు. 2021 గణాంకాల ప్రకారం చైనాలో వీరి జనాభా సుమారు 6.7 లక్షల కంటే ఎక్కువగా ఉంది. ఆధునిక కాలంలో ఈ ఆచారాలు తగ్గుముఖం పట్టినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ సంప్రదాయం ఒక ప్రత్యేక గుర్తింపుగా కొనసాగుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..