AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో అతిపెద్ద జిల్లా ఏది..? రాష్ట్రాలు, దేశాలు కూడా దీన్ని ముందు దిగదుడుపే..

భారతదేశంలోనే అతిపెద్ద జిల్లా ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే..! ఎందుకంటే మన దేశంలో ఉన్న ఒక జిల్లా వైశాల్యం కేరళ, హర్యానా వంటి రాష్ట్రాల కంటే.. స్విట్జర్లాండ్, డెన్మార్క్ వంటి ప్రముఖ ఐరోపా దేశాల కంటే కూడా చాలా పెద్దది. ఢిల్లీ కంటే దాదాపు 31 రెట్లు పెద్దదైన ఆ జిల్లా ఏది? దానికున్న ప్రత్యేకతలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారత్‌లో అతిపెద్ద జిల్లా ఏది..? రాష్ట్రాలు, దేశాలు కూడా దీన్ని ముందు దిగదుడుపే..
Which Is The Largest District In India
Krishna S
|

Updated on: Oct 30, 2026 | 7:18 PM

Share

భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది..? ఈ ప్రశ్నకు చాలామంది ఠక్కున సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ మన దేశంలో ఒక జిల్లా ఎంత పెద్దదంటే.. దేశంలోని పలు రాష్ట్రాలను, ఐరోపాలోని ప్రముఖ దేశాలను సైతం విస్తీర్ణంలో వెనక్కి నెట్టేస్తుంది. దాదాపు 45,674 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆ జిల్లా మరేదో కాదు.. గుజరాత్‌లోని చారిత్రక కచ్ జిల్లా. కచ్ జిల్లా విస్తీర్ణాన్ని గమనిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మన దేశంలోని హర్యానా (44,212 చ.కి.మీ.), కేరళ (38,863 చ.కి.మీ.), గోవా వంటి రాష్ట్రాల కంటే కచ్ జిల్లా వైశాల్యమే ఎక్కువ. జాతీయ రాజధాని ఢిల్లీతో పోలిస్తే ఇది దాదాపు 31 రెట్లు పెద్దది. గుజరాత్ రాష్ట్ర మొత్తం వైశాల్యంలో సుమారు 23 శాతాన్ని ఈ ఒక్క జిల్లానే ఆక్రమించింది. అంతర్జాతీయంగా చూస్తే.. డెన్మార్క్ (సుమారు 43,000 చ.కి.మీ.), నెదర్లాండ్స్ (సుమారు 41,865 చ.కి.మీ.), స్విట్జర్లాండ్ (సుమారు 41,291 చ.కి.మీ.), ఎస్టోనియా (సుమారు 45,339 చ.కి.మీ.) వంటి ఐరోపా దేశాల కంటే కచ్ జిల్లా వైశాల్యం పెద్దది కావడం దీని విశిష్టతను చాటిచెబుతోంది.

విస్తీర్ణం భారీ.. జనసాంద్రత స్వల్పం..

విస్తీర్ణంలో అతిపెద్దదైనప్పటికీ, జనసాంద్రత పరంగా దేశంలోనే అత్యల్ప సాంద్రత కలిగిన జిల్లాల్లో కచ్ ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 20,92,371 మాత్రమే. చదరపు కిలోమీటరుకు సగటున 46 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో అధిక భాగం విశాలమైన ఉప్పు ఎడారితో నిండి ఉండటం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు మానవ నివాసానికి అంతగా అనుకూలించకపోవడమే ఇక్కడ జనసాంద్రత తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.

రాన్ ఆఫ్ కచ్: వెండిలా మెరిసే ఉప్పు ఎడారి

కచ్ జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రధాన ఆకర్షణ రాన్ ఆఫ్ కచ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఎడారులలో ఇది ఒకటి. వర్షాకాలంలో సముద్రపు నీరు వచ్చి చేరడంతో ఈ ప్రాంతమంతా జలమయమవుతుంది. చలికాలం వచ్చేసరికి ఆ నీరంతా ఆవిరైపోయి, మైళ్ల దూరం వరకు తెల్లటి ఉప్పు పొర పేరుకుపోయి నేలంతా ధవళ వర్ణంలో మెరిసిపోతుంది. ముఖ్యంగా పౌర్ణమి రాత్రుల్లో చంద్రుడి వెన్నెలకు ఈ తెల్లని ఎడారి వెండిలా తళతళలాడుతూ పర్యాటకులకు అద్భుత దృశ్యానుభూతిని ఇస్తుంది. ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు గుజరాత్ ప్రభుత్వం ఇక్కడ నిర్వహించే రాన్ ఉత్సవ్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ధోర్డో గ్రామంలో ఏర్పాటు చేసే టెంట్ సిటీ, గుజరాతీ జానపద నృత్యాలు, సంగీతం, స్థానిక హస్తకళల ప్రదర్శనలు ఈ ఉత్సవానికి ప్రత్యేక శోభను తెస్తాయి.

ప్రపంచ వారసత్వ సంపద.. చారిత్రక ప్రాధాన్యం

కచ్ జిల్లాకు పరిపాలనా కేంద్రం భుజ్ నగరం. ఈ జిల్లా చారిత్రక, సాంస్కృతిక, పర్యావరణ రంగాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ధోలవీర: సింధు లోయ నాగరికతకు చెందిన ప్రాచీన నగరం ధోలవీర శిథిలాలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. అత్యాధునిక నీటి సంరక్షణ వ్యవస్థ, నగర నిర్మాణ కౌశలానికి నిదర్శనమైన ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

వన్యప్రాణుల స్వర్గధామం: అంతరించిపోతున్న అరుదైన భారతీయ అడవి గాడిదలకు ఆవాసమైన అభయారణ్యం ఇక్కడ ఉంది. అలాగే ఏటా వేలాదిగా వచ్చే గ్రేటర్ ఫ్లెమింగో పక్షులకు ఈ ఉప్పు నేలలు ప్రధాన కేంద్రం.

వ్యూహాత్మక – ఆర్థిక ప్రాధాన్యం: పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్నందున రక్షణ పరంగా కచ్ అత్యంత కీలకమైనది. ఉప్పు ఉత్పత్తి, పాడి పరిశ్రమ, హస్తకళలతో పాటు భారతదేశంలోనే అతిపెద్ద వాణిజ్య ఓడరేవుల్లో ఒకటైన దీన్‌దయాళ్ పోర్ట్ ఇక్కడే ఉండటం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలాన్నిస్తోంది.

Follow Us