ఆకాశంలో జెల్లీ ఫిష్ యూఎఫ్ఓలు.. డైనోసార్ల కాలం నాటి ఎగిరే జీవులు మళ్లీ వచ్చాయా?
అమెరికా, యూరప్, మెక్సికో ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆకాశంలో జెల్లీ ఫిష్ లాంటి వింత ఆకారం, డైనోసార్ల కాలంలో జీవించిన ప్టెరోడాక్టైల్ (Pterodactyl) తరహా ఎగిరే జీవులు కనిపించాయంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఫొటోలను గమనిస్తే.. భారీ రెక్కలతో కూడిన ఓ నల్లటి ఆకారం కనిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. అయితే అంతరిక్షం, గ్రహాంతర వాసులు, వింత జీవుల ఆనవాళ్లపై ఎప్పుడూ ఆసక్తికర చర్చ నడుస్తూనే ఉంటుంది. లేటెస్ట్గా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌గా మారింది. అందులో ఆకాశంలో జెల్లీ ఫిష్ లాంటి వింత ఆకారం, డైనోసార్ల కాలంలో జీవించిన ప్టెరోడాక్టైల్ (Pterodactyl) తరహా ఎగిరే జీవులు కనిపించాయంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అమెరికా, యూరప్, మెక్సికో ప్రాంతాల్లో ఇలాంటి వింత దృశ్యాలు కనిపించాయంటూ పలు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే అసలు ఆ వీడియోల్లో కనిపిస్తున్నవి ఏమిటి ? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ??
అమెరికా సైనిక స్థావరం సమీపంలో జెల్లీ ఫిష్ యూఎఫ్ఓ?
ముందుగా అలాస్కాలోని అంకరేజ్ ప్రాంతంలో నివసిస్తున్న సారా జేన్ ఓస్బోర్న్ అనే మహిళ.. ఆకాశంలో కదులుతున్న ఓ నల్లటి ఆకారాన్ని తన కెమెరాలో బంధించారు. చెట్ల వెనుక నుంచి బయటకు వచ్చిన ఆ వస్తువు.. కొద్దిసేపు గాలిలో కదులుతూ కనిపించి ఆ తర్వాత అదృశ్యమైంది. ఇది అమెరికా సైనిక స్థావరం వైపు వెళ్తున్నట్లు వీడియోలో కనిపించడంతో ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత మెక్సికోలోని జువారెజ్ ప్రాంతంలోనూ ఇలాంటి వింత వస్తువు కనిపించిందంటూ మరో వీడియో వైరల్ అయింది. లోహపు ఆకారంతో పొడవైన తీగల్లాంటి భాగాలు వేలాడుతూ ఆకాశంలో కదులుతున్నట్లు అందులో కనిపిస్తోంది. అలానే మేరీ ఐలాండ్ ప్రాంతంలో ఇలాంటి మూడు వస్తువులు కనిపించాయంటూ మరో వీడియో సర్క్యులేట్ అవుతోంది. దీంతో వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు తెరలేపింది.
అమెరికా సైనిక స్థావరం రియాక్షన్..
కాగా అలాస్కాలోని ఘటనపై అమెరికా సైనిక అధికారులు కూడా స్పందించారు. జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్-రిచర్డ్సన్ ప్రతినిధి ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. జూన్ 15, 2026న తమ సైనిక స్థావరం సమీపంలో గగనతలంలో వింత వస్తువు కనిపించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే అందుకు సంబంధించి అదనపు సమాచారం తమ వద్ద లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ వస్తువు ఏమిటన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదని క్లారిటీ ఇచ్చారు.
మెక్సికో ఆకాశంలో ప్టెరోడాక్టైల్ కనిపించిందా?
ఓ వైపు జెల్లీ ఫిష్ యూఎఫ్ఓల చర్చ కొనసాగుతుండగానే మెక్సికోలో మరో చర్చ నడుస్తున్నట్టు సమాచారం. డైనోసార్ల కాలంలో జీవించి, లక్షల సంవత్సరాల క్రితమే అంతరించిపోయిన ప్టెరోడాక్టైల్.. మళ్లీ కనిపించిందంటూ కొందరు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం ఓ నెటిజన్ షేర్ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వైరల్ అవుతున్న ఫొటోలను గమనిస్తే.. భారీ రెక్కలతో కూడిన ఓ నల్లటి ఆకారం కనిపిస్తోంది. దాంతో ఆ ఆకారం నిజంగానే అంతరించిపోయిన జీవిదా? లేక మరేంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జైమ్ మౌస్సాన్ సైతం ఈ జీవికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. జువారెజ్ లోయలో ఇటీవల చిత్రీకరించిన ఈ వింత జీవి.. అక్కడ ఏదైనా డైమెన్షనల్ పోర్టల్ ఉందనే విషయానికి ఆధారమా? అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వీడియోలు ఎంత ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ.. వాటి ఆధారంగా కనిపిస్తున్నది ఏ జీవి అనే విషయాన్ని నిర్ధారించడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీడియోలు చాలా తక్కువ నిడివితో ఉండటంతో స్పష్టమైన నిర్ధారణకు రావడం కష్టమని చెబుతున్నారు. మరోవైపు మెక్సికోలో ఇలాంటి వింత జీవుల గురించి ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వీడియోనూ నిజమని నమ్మలేమని.. వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు నిర్ధారణకు రాకూడదని చెబుతున్నారు.
