AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఔరంగజేబు కట్టిన మినీ తాజ్‌మహల్‌ ఎక్కడుందో తెలుసా?

తాజ్‌మహల్‌ను కట్టడం షాజహాన్‌కేనా సాధ్యం..? ఏం ఆయన కొడుకు ఔరంగజేబు కట్టలేడా..? ఎందుకు కట్టలేడు..? కాకపోతే తాజ్‌మహల్‌..

Viral: ఔరంగజేబు కట్టిన మినీ తాజ్‌మహల్‌ ఎక్కడుందో తెలుసా?
Taj Mahal 1
Balu
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 15, 2022 | 7:02 PM

Share

తాజ్‌మహల్‌ను కట్టడం షాజహాన్‌కేనా సాధ్యం..? ఏం ఆయన కొడుకు ఔరంగజేబు కట్టలేడా..? ఎందుకు కట్టలేడు..? కాకపోతే తాజ్‌మహల్‌ అంత అందమైన కట్టడాన్ని నిర్మించాలనుకున్నాడు కానీ డబ్బులు ఖర్చు పెట్టడంలో పిసినారిగా వ్యవహరించాడు. మహారాష్ర్టలోని ఔరంగాబాద్‌లో అచ్చం తాజ్‌మహల్‌ను పోలిన ఓ ప్రేమచిహ్నం ఒకటొంది.. పేరు బీబీ కా మఖ్బారా! ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ నిర్మించిన ఈ ప్రేమసౌధం చూట్టానికి తాజ్‌మహల్‌లాగే ఉంటుంది. ఔరంగజేబు మొదటి భార్య రబియా ఉద్‌ దౌరాని సమాధి ఇది! పేదవాడి తాజ్‌మహల్‌గా పేరొందిన ఈ పాలరాతి కట్టడానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ఔరంగజేబు నిర్మించిన అతి పెద్ద కట్టడం కావడం..

ఔరంగజేబ్ కాలంలోని ముఖ్యమైన నిర్మాణం ఔరంగాబాద్ వద్ద నిర్మించిన ఆయన భార్య రబియా ఉద్‌ దుర్రాని సమాధి. దీన్ని పేదవాడి తాజ్‌మహల్ అంటారు. తండ్రి షాజహాన్‌ తాజ్‌మహల్‌ కట్టాడన్న పంతమో, నిజంగానే తన భార్య మీద ప్రేమో, తన పేరిటా ఓ నిర్మాణం ఉండాలన్న కోరికో తెలియదు కానీ మొత్తానికి ఔరంగజేబు ఓ మినీ తాజ్‌మహల్‌ అయితే కట్టేశాడు. స్మారక నిర్మాణాలపై ఎలాంటి ఆసక్తి, అభిరుచి లేని ఔరంగజేబు ఈ సౌధాన్ని నిర్మించాడంటే భార్య మీద అంతో ఇంతో ప్రేమ ఉన్నట్టే అనుకోవాలి. పండు వెన్నెల్లో వెండి కొండల ధవళకాంతుల్లో మెరిసిపోయే తాజ్‌మహల్‌ అంత అందంగా లేకపోయినా, నిర్మాణం అంత గొప్పది కాకపోయినా పర్యాటకులను మాత్రం ఆకర్షిస్తూనే ఉంది. కారణం ప్రేమసౌధం కావడమే. తాజ్‌మహల్‌ను గుర్తుకు తేవడమే!

తాజ్‌మహల్‌లా ఉంటుంది కాబట్టే దీన్ని దక్కనీ తాజ్‌ అంటారు. దీనికి రాళ్లు ఎత్తిన కూలీలెవరో తెలియదు కానీ వాస్తుశిల్పి మాత్రం అతా ఉల్లా ఇంజనీర్‌ హన్స్‌పత్‌ రాయ్‌. అతా ఉల్లా ఎవరో కాదు. తాజ్‌మహల్‌కు ప్రధాన వాస్తుశిల్పిగా వ్యవహరించిన ఉస్తాద్‌ అహ్మద్‌ లహౌరి కుమారుడు. క్రీస్తుశకం 1651-1661 మధ్య కాలంలో బీబీ కా మఖ్బారాను నిర్మించి ఉంటారు. గులామ్‌ ముస్తఫా రాసిన తారీఖ్‌ నామ ప్రకారం ఈ నిర్మాణానికి అయిన ఖర్చు ఆరు లక్షల 68 వేల 203 రూపాయల ఏడు అణాలు. ఇంతేనా అని అనుకుంటారేమో. అయిదు శతాబ్దాల కిందట ఇది చాలా పెద్దమొత్తం… అయినప్పటికీ తాజ్‌మహల్‌తో పోలిస్తే తక్కువే అయ్యింది. కారణం ఔరంగజేబు ఈ నిర్మాణం కోసం కేటాయించిన సొమ్ము ఏడు లక్షలే! అంతకు మించి పైసా కూడా ఇవ్వననేశాడు. జైపూర్‌ దగ్గరున్న గనుల నుంచి తెల్లటి రాతిని తెప్పించారు.. పాలరాతినైతే తెప్పించారు కానీ తాజ్‌మహల్‌ అంత సుందరంగా తీర్చిదిద్దలేకపోయారు. కారణం డబ్బే! అంతా అయ్యాక నాణ్యత కొరవడిన ఒక నఖలుగా మిగిలిపోయింది.. పులిని చూసి నక్క వాతపెట్టుకోవడమంటే ఇదే కాబోలు! తాజ్‌మహల్‌తో పోలిక పెట్టకుండా చూస్తే మాత్రం బాగానే ఉంటుంది.. లోపల రబియా ఉద్‌ దుర్రాని సమాధి ఉంటుంది.. నాలుగు వైపులా పాలరాతి మీద చెక్కిన శిల్పాలు ఉన్నాయి.. పైన ఉన్న డోమ్‌ను కూడా చక్కటి నగిషీతో తీర్చిదిద్దారు. ఇందులో ఓ పక్కన నిజాం రాజులు ప్రార్థనల కోసం ఓ పెద్ద హాల్‌ను నిర్మించారు. మొత్తంమీద దక్కనీ తాజ్‌మహల్‌ చూడతగ్గ ప్రేమ సౌధమే!

Taj Mahal