Viral Video:వామనుడికి మూడు అడుగల స్థలం ఇచ్చి గొప్ప చక్రవర్తిగా నిలిచిపోయాడు బలిచక్రవర్తి. ఆ బలి చక్రవర్తి బ్యాంకుకు వచ్చాడు. అవునండీ. అయితే, ఆయన డబ్బులు డ్రా చేసుకునేందుకు రాలేదు. బ్యాంకు కస్టమర్లకు సేవలందించేందుకు ఆయన వచ్చాడు. ఓనం పండగ సందర్భంగా కేరళలోని తెల్లిచెర్రి SBI బ్రాంచ్‌కు చెందిన ఓ ఉద్యోగి బలి చక్రవర్తి వేషం ధరించాడు, ఆ వేషధారణలోనే బ్యాంకు విధులకు హాజరయ్యాడు. కిరీటం, పెద్ద పెద్ద మీసాలు, మెడలో పూలదండ, నగలు ధరించి, బలిచక్రవర్తి రూపంలో బ్యాంక్‌లో తన చైర్‌లో కూర్చున్నాడు. తన వద్దకు వచ్చిన కస్టమర్లకు సేవలందించాడు. ఓనం పండగ రోజు బలిచక్రవర్తి ఈ భూమి మీదకు వస్తాడన్నది మలయాళీల నమ్మకం. ఆ కారణంగానే ఆ ఉద్యోగి బలిచక్రవర్తి వేషం ధరించినట్లు తెలుస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు శభాష్ అంటున్నారు. ప్రొఫెషన్ ఏదైనా సంప్రదాయానికి విలువ ఇవ్వడాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.