ఉత్తరాఖండ్ విలయం: తపోవన్ టన్నెల్ దగ్గర ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతి, సహాయక చర్యలు నిలిపివేత
ఉత్తరాఖండ్‌లో సంభవించిన మెరుపు వరదలు, గ్లేసియర్ బరస్ట్ ఔట్ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. రాత్రివేళ నీటి మట్టం మళ్లీ ఒక్కసారిగా పెరగడంతో తపోవన్ టన్నెల్..
ఉత్తరాఖండ్‌లో సంభవించిన మెరుపు వరదలు, గ్లేసియర్ బరస్ట్ ఔట్ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. రాత్రివేళ నీటి మట్టం మళ్లీ ఒక్కసారిగా పెరగడంతో తపోవన్ టన్నెల్ దగ్గర సహాయక చర్యలను నిలిపివేశారు. తాజా సమాచారం ప్రకారం సొరంగంలో చిక్కుకున్న 18 మందిని ఐటిబిపి సిబ్బంది ఇప్పటివరకూ రక్షించారు. దాదాపు 30 మంది చిక్కుకున్న రెండవ సొరంగంపై ప్రస్తుతం దృష్టి పెట్టారు. నీటి మట్టం పెరగడంతో 900 మీటర్ల పొడవైన తపోవన్ టన్నెల్ (ఎన్‌టిపిసి) వద్ద సహాయక చర్యలు ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఉత్తరాఖండ్ డిజిపి అశోక్ కుమార్ తెలిపారు. నీటి మట్టం మళ్లీ ఒక్కసారిగా పెరిగడంతో సహాయక చర్యలు నిలిపివేయవలసి వచ్చిందని, నీటిలో కొట్టుకుపోయి కనిపించకుండా పోయిన చాలా మంది వ్యక్తులు ఈ రెండు ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని అశోక్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఉదయానికి వారి ఆచూకీ గురించి స్పష్టమైన సమాచారం వస్తుందని భావిస్తున్నామని కుమార్ అన్నారు.