Women’s Day 2021: ఉన్మాదం చేసిన గాయంతో గొంతు పలకడం లేదు.. అయినా మంచంపై నుంచే మహిళా లోకానికి లేఖ రాసిన ప్రియాంక..
Women's Day 2021: ఓ ప్రేమోన్మాది చేసిన గాయం నుంచి ఆమె ఇంకా కోలుకోలేదు. మూడునెలల క్రితం జరిగిన ఘోరం తాలూకు.. కత్తిగాటు.. ఆ యువతిని ఇంకా వెంటాడుతూనే ఉంది. గొంతు నుంచి మాట రాక, శ్వాస తీసుకునేంత శక్తి లేక మంచంపై నుంచే మహిళాలోకానికి విషెస్ చెబుతోంది.
Priyanka Letter to Womens: తన ఆటపాటలతో ఎప్పుడూ చలాకీగా ఉండే ప్రియాంక.. కొన్ని రోజులుగా మంచంపైనే ఉంటోంది. విశాఖపట్నంలో గత ఏడాది డిసెంబర్‌లో ప్రేమోన్మాది శ్రీకాంత్ చేసిన గాయం ఇంకా వెంటాడుతూనే ఉంది. వైద్యం కోసం ఇప్పటికీ అనేక ఆసుపత్రులకు తిరుగుతూనే ఉంది.
గలగల మాట్లాడే ఆ అమ్మాయి గొంతు ఇప్పుడు పలకడం లేదు. తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితమైన ప్రియాంక.. గొంతు నుంచి సరిగా మాటలు రాకపోగా.. శ్వాస కూడా తీసుకోవడం కష్టం అవుతోంది. ఈ మధ్య తన స్నేహితులతను పలకరిస్తూ లేఖ రాసిన ప్రియాంక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఓ లేఖ రాశారు.
తాను పడుతున్న బాధను ఆ లేఖరూపంలో లోకానికి తెలిసేలా చేసింది. చేయని తప్పుకు పడుతున్న కష్టాన్ని కన్నీళ్లరూపంలో లేఖపై రాసింది. తనలాంటి కష్టం, తన తల్లిపడుతున్న వేదనను సమాజానికి తెలిసేలా చేసింది. ఫ్రెండ్ సర్కిల్‌లో ప్రియాంక అంటే.. చలాకీ అమ్మాయిగా పేరుంది. ఆటపాటలతో ఎప్పుడూ సందడి చేసేదన్న పేరుంది.
తోటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తూనే.. చదువులోనూ రాణిస్తూ ఉండేది. కానీ తనకు ఏం కావాలన్నా ఇప్పుడు సైగలతోనే తల్లికి చెబుతున్న దృశ్యాలను చూస్తుంటే.. కన్నీళ్లు రాకమానదు. అమ్మా అని పిలవలేదు. ఏదైనా కావాలంటే ఇది కావాలని అడగలేదు. ఏదైనా ఇదిగో ఇలా చేతి రాత రూపంలోనే చెబుతున్న ప్రియాంక.. మూడునెలలుగా చిత్రవధను అనుభవిస్తోంది.
అన్నా అని పిలిచినా ప్రేమోన్మాది శ్రీకాంత్ కనికరించలేదని ప్రియాంక వాపోతుంది. బిడ్డకు ఏదైనా కావాలంటే ఆ సైగలను అర్ధం చేసుకుని అన్నీ మంచం మీదకే తెచ్చిపెడుతోంది ఆ తల్లి. ముందులా ఎప్పుడు మారతానో అని ఎదురుచూస్తున్న ప్రియాంక… తనలాంటి కష్టం ఎవరికీ రాకూడదని కోరుకుంటోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని లేఖరూపంలో అందరితో పంచుకుంది.