Andhra Pradesh: మరో సోషల్ మీడియా సంచలనం.. మన ఒంగోలు వ్యక్తే.. స్పెషాలిటీ ఏంటంటే..?
చిరు మూవీలోని 'రూపు తేరా మస్తానా... నీకు డేరా వేస్తానా...' అన్న పాటకు ఒంగోలులో మతిస్థిమితం లేని వ్యక్తి వేసిన స్ట్రీట్ డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
Trending News: ఒంగోలుకు చెందిన ఓ మతిస్థిమితం లేని వ్యక్తి చిరంజీవి పాటకు డ్యాన్స్ వేయడం చూసి జనం తెగ ఆశ్చర్యపోతున్నారు… చింపిరి జుత్తు, మట్టికొట్టుకుపోయిన శరీరం, ఒంటిపై గోచి తప్ప ఇతర ఎటువంటి ఆఛ్చాదన లేకపోవడం వంటి లుక్స్‌తో భయంగొలిపేలా ఉన్న ఈ వ్యక్తి చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిరంజీవిలా డ్యాన్స్ వేయాలంటే గట్స్ ఉండాలి.. ఆయన గ్రేస్, బాడీ లెంగ్వేజ్‌కు ఇండియన్ సినిమా ప్రముఖులే ఫిదా అవుతారు. అలా ఉంటుంది చిరంజీవి డ్యాన్స్. తాజాగా చిరు మూవీలోని ‘రూపు తేరా మస్తానా… నీకు డేరా వేస్తానా…’ అన్న పాటకు ఒంగోలులో మతిస్థిమితం లేని వ్యక్తి వేసిన స్ట్రీట్ డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది. స్థానికులు దీవానాగా పిలుచుకునే ఈ వ్యక్తి వేసిన డ్యాన్స్‌కు ముగ్డులైన కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విశేషమేంటంటే చిరంజీవి డ్యాన్స్‌ను ఇరగదీసిన ఈ దీవానా రెండు రోజుల క్రితం ఒంగోలులో జరిగిన భారీ అగ్ని ప్రమాదం సంఘటనలో మంటలు ఆర్పేందుకు శ్రమించిన ఫైర్ సిబ్బందికి సహాయం చేయడం. నీటిపైపులను ఒకచోట నుంచి మరో చోటకు తరలించడం, మంటలు ఆర్పే సిబ్బందికి సూచనలు ఇవ్వడం వంటికి కనిపించాయి. సంఘటనా స్థలంలో ఫైర్ యాక్సిడెంట్ దగ్గర గుమిగూడిన జనం చోద్యం చూశారే కానీ ఈ మతిస్థిమితం వ్యక్తిలా సాయం చేసిన పాపాన పోలేదు. మరి ఇతడిని మతిస్థిమితం లేని దీవానా అనాలా… లేక లోకం పోకడలు నచ్చక పిచ్చోడిలా మారిన డ్యాన్స్ మాస్టర్ అనాలా… అర్ధంకాని పరిస్థితి… నిన్నటికి నిన్న కచ్చాబాదమ్ పాటతో ఫేమస్ అయిన ఓ వీధి వ్యాపారి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యాడు… ఇప్పుడు ఇదే తరహాలో ఇతను కూడా ఫేమస్ అయ్యేలా ఉన్నాడు.
ఎవరీ దీవానా…
అసలు ఇంతకీ ఎవరీ దీవానా… ఒంగోలు నగరంలో పిచ్చోడిలా తిరుగుతూ అప్పుడప్పుడు స్ట్రీట్ డ్యాన్సులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఇతని పేరు సర్తాజ్. గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేశాడు… నిరుపేద కుటుంబంలో పుట్టినా కష్టపడి పనిచేసి బతికే మనస్థత్వం ఉన్నవాడు. మూడేళ్ళ క్రితం వరకు తల్లిదండ్రులతో కలిసి బతికాడు… 2018లో తండ్రి చనిపోవడం, ఉన్న ఇల్లు వర్షానికి కూలిపోవడంతో ఆర్దిక ఇబ్బందులు ఎదురయ్యాయి… దీంతో మానసిక ఆందోళనలు ఎక్కువయ్యాయి. అప్పటి నుంచి మానసిక స్థితి కోల్పోయి ఎక్కడంటే అక్కడ పడుకోవడం చేసేవాడు… కాల క్రమంలో ఇంటి అడ్రస్ కూడా మర్చిపోయాడు… అయితే తన పేరును మాత్రం గుర్తు పెట్టుకున్నాడు. తన తండ్రి చనిపోయాడని, ఇల్లు వర్షానికి కూలిపోయిందని మాత్రం చెబుతాడు… అలాగే తనకు అన్నదమ్ములు, చెల్లెళ్ళు ఉన్నారంటాడు కానీ వాళ్ళు ఎక్కడుంటారో తెలియదంటాడు. తాను పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశానని, పోలీసులంతా తనకు బాగా తెలుసంటాడు… ఇతడు మూడేళ్ళ నుంచి ఒంగోలులోని మంగమ్మ కాలేజి సమీపంలోని లారీ మెకానిక్ షెడ్ల దగ్గరకు వచ్చి ఉంటున్నాడు. షెడ్ల దగ్గరే ఉంటూ పాత సీసాలు, గ్లాసులు, ప్లాస్టిక్ బాటిళ్ళు ఏరుకుని అమ్ముకుని ఆ వచ్చిన డబ్బులతో అన్నం వండుకుని తింటున్నాడు. ఎవరి దగ్గర చేయిచాచి డబ్బులు అడగడు… ఎవరైనా అన్నం పెట్టినా తినడు… ఒకరి సొమ్ము తనకు వద్దంటాడు… తాను పాతసీసాలు, ప్లాస్టిక్ వస్తువులు సేకరించి అమ్మితే వచ్చిన డబ్బులతోనే బతుకుతున్నాడు… ఒంటిపై కేవలం గోచీమాత్రమే పెట్టుకుంటాడు…. ఎవరైనా చొక్కా, ప్యాంటు ఇచ్చినా వేసుకోడు… చింపిరి జుత్తుతో, మాసిన గడ్డంతో, ఒళ్లంతా దుమ్ముపట్టి ఉన్న రూపంతోనే తిరుగుతుంటాడు… మెకానిక్ షెడ్ల దగ్గర ఎవరైనా సెల్‌పోన్లో పాటలు పెడితే వాటిని వింటూ ఉంటాడు… ఒక్కసారిగా మూడ్ వస్తే ఆ పాటలకు బ్రేక్‌డ్యాన్స్ అంటూ షేక్ చేసేస్తాడు… ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో పుష్ప, పుష్పరాజ్, తగ్గేదేలా అన్న డైలాగ్‌ను తనదైన స్టైల్లో చెబుతూ ఓ పిచ్చి నవ్వు నవ్వుతాడు… అంతేకాకుండా ఇటీవల విడుదలైన సినిమాల్లోని డైలాగ్స్‌ను ఇతరులు చూపిస్తే వాటిని అనుకరిస్తూ అలవోకగా డైలాగ్స్ చెప్పేస్తాడు… వీటిని కొంతమంది స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. తనకు డ్యాన్స్ అంటే ప్రాణమని, చిరంజీవి, ఎన్‌టిఆర్, ఏఎన్‌ఆర్ సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తామని చెబుతాడు. తీరా ఇప్పుడు డ్యాన్స్ వేయమంటే తనకు మూడ్ రావాలి కదా అంటాడు… తనకు అన్నీ తెలుసని, దేవుడే తనకు ఏదోఒకదారి చూపిస్తాడని ఎదురు చూస్తున్నానని వైరాగ్యం ప్రదర్శిస్తాడు. సర్తాజ్‌ను స్థానికులు తమలో ఒకడిగా చూస్తున్నారు… అతడి ఆకారాన్ని కాకుండా మంచి మనసును ప్రేమిస్తున్నారు… ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా, ఒకరి దగ్గర చేతులు చాచకుండా తన సంపాదనతోనే బతికే సర్తాజ్ అంటే తమకు అభిమానమని స్థానికులు చెబుతున్నారు.
Also Read: ఇద్దరు ఫ్రెండ్స్ మిస్సింగ్.. రెండేళ్లుగా వీడని చిక్కుముడి.. ఒక్క పోస్ట్‌తో వెలుగులోకి సంచలన విషయాలు