AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెరైన్ డ్రైవ్‌లో కలకలం.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన ‘రహస్య జీవి’.. అసలు నిజం తెలిసి షాక్!

కలల నగరమైన ముంబైలోని మెరైన్ డ్రైవ్.. అందమైన సాయంత్రాలకు, ఎగిసిపడే సముద్రపు అలలకు ప్రసిద్ధి. అయితే, ఇటీవల మెరైన్ డ్రైవ్ తీరానికి వచ్చిన పర్యాటకులు ఒక వింతైన, భారీ జీవిని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. రాళ్ల మధ్య చిక్కుకున్న ఆ భారీ జీవిని చూసేందుకు వందలాది మంది జనం తరలివచ్చారు. సముద్ర గర్భం నుండి ఏ రకమైన వింత రాక్షసి ఒడ్డుకు వచ్చిందా అని స్థానికులు విస్మయానికి గురయ్యారు.

మెరైన్ డ్రైవ్‌లో కలకలం.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన ‘రహస్య జీవి’.. అసలు నిజం తెలిసి షాక్!
Humpback Dolphin
Balaraju Goud
|

Updated on: Jun 06, 2026 | 4:21 PM

Share

కలల నగరమైన ముంబైలోని మెరైన్ డ్రైవ్.. అందమైన సాయంత్రాలకు, ఎగిసిపడే సముద్రపు అలలకు ప్రసిద్ధి. అయితే, ఇటీవల మెరైన్ డ్రైవ్ తీరానికి వచ్చిన పర్యాటకులు ఒక వింతైన, భారీ జీవిని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. రాళ్ల మధ్య చిక్కుకున్న ఆ భారీ జీవిని చూసేందుకు వందలాది మంది జనం తరలివచ్చారు. సముద్ర గర్భం నుండి ఏ రకమైన వింత రాక్షసి ఒడ్డుకు వచ్చిందా అని స్థానికులు విస్మయం చెందారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మెరైన్ డ్రైవ్ వెంబడి ఉండే పెద్ద బండరాళ్ల మధ్య ఆ భారీ జీవి కదలకుండా చిక్కుకుపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే భద్రతా సిబ్బంది, మున్సిపల్ సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రిఫ్లెక్టివ్ జాకెట్లు, మాస్కులు ధరించిన సిబ్బంది తాడుల సహాయంతో ఎంతో శ్రమించి ఆ భారీ జీవిని బండరాళ్ల మధ్య నుండి బయటకు లాగారు.

మొదట్లో ఈ జీవిని చూసి ప్రజలు తిమింగలం అని, సముద్ర రాక్షసి అని రకరకాల ఊహాగానాలు చేశారు. అయితే, వన్యప్రాణి నిపుణులు పరిశీలించిన తర్వాత ఆ ‘రహస్య జీవి’ గుట్టు విడిపోయింది. అది అంతరించిపోతున్న అరుదైన ‘హిందూ మహాసముద్ర హంప్‌బ్యాక్ డాల్ఫిన్’ అని నిపుణులు తేల్చారు. అయితే, దురదృష్టవశాత్తు ఒడ్డుకు కొట్టుకొచ్చే సమయానికే ఆ డాల్ఫిన్ చనిపోయి ఉంది.

సాధారణంగా ఈ జాతి డాల్ఫిన్లు హిందూ మహాసముద్ర తీరప్రాంతాలలో ఎక్కువగా సంచరిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. సముద్ర కాలుష్యం పెరిగిపోవడం, ప్లాస్టిక్ వ్యర్థాలను మింగడం, లేదా సముద్రంలో వెళ్లే పెద్ద ఓడలు ఢీకొట్టడం వంటి కారణాల వల్ల ఇవి చనిపోయే అవకాశం ఉందంటున్నారు. అలా చనిపోయిన తర్వాతే అలల తాకిడికి కొట్టుకుంటూ వచ్చి మెరైన్ డ్రైవ్ రాళ్ల మధ్య చిక్కుకుందని స్పష్టం చేశారు.

మొదట ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన నెటిజన్లు, ఆ తర్వాత అది మూగ జీవమైన డాల్ఫిన్ మృతదేహమని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సముద్ర కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వన్యప్రాణి ప్రేమికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అధికారులు ఆ డాల్ఫిన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us