రక్తదానం చేసి కుక్కను కాపాడిన మరో కుక్క
సాధారణంగా మనుషులు రక్తదానం చేయడాన్ని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల ఓ కుక్క మరో కుక్కకు రక్తదానం చేసి, దాని ప్రాణాలను కాపాడింది.

సాధారణంగా మనుషులు రక్తదానం చేయడాన్ని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల ఓ కుక్క మరో కుక్కకు రక్తదానం చేసి, దాని ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన ఓ కుటుంబం డానీ(13) అనే ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. అది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా.. చికిత్స నిమిత్తం యజమానులు కోల్‌కతాకు తీసుకొచ్చారు. అయితే ఆ కుక్కకు రక్తం కావాల్సి ఉండగా.. యజమానులు ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలో నటుడు అనింద్య చటర్జీకి చెందిన సియా అనే కుక్క డానీకి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడింది.
దీనిపై అనింద్య మాట్లాడుతూ.. ”సియా చాలా తెలివిగా, ఎలాంటి ఇబ్బంది పడకుండా రక్తదానం చేసింది. ఇందుకు సియా కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంది. సియాను చూసి గర్వపడుతున్నా” అని అన్నారు. మరోవైపు దీనిపై వెటర్నరీ డాక్టర్ దేబాజిత్ రాయ్ మాట్లాడుతూ.. ”డానీ దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యతో బాధపడుతుంది. చికిత్స అందించాలంటే రక్తం కచ్చితంగా కావాలి. కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల రక్తదాతలు దొరకని పరిస్థితి ఏర్పడింది. కోల్‌కతాలో ఇది కొత్త చికిత్స. డానీకి రక్తదాత దొరికినందుకు చాలా సంతోషించాం అని తెలిపారు. ఇదిలా ఉంటే గత నెలలో అమెరికాలో అనారోగ్యంతో ఉన్న ఓ కుక్కపిల్లను కాపాడేందుకు ఏడేళ్ల జాక్స్ అనే కుక్క రక్తదానం చేసి వార్తలకెక్కిన విషయం తెలిసిందే.