కాలికి గాయమై నడవలేకపోతున్నానంటూ పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ కాల్.. తీరా ఆస్పత్రికి తీసుకెళ్లాక.!
కాలికి గాయమైందని.. అస్సలు నడవలేకపోతున్నానంటూ ఓ వ్యక్తి పోలీసులకు పదేపదే ఫోన్ కాల్ చేశాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు.

కాలికి గాయమైందని.. అస్సలు నడవలేకపోతున్నానంటూ ఓ వ్యక్తి పోలీసులకు పదేపదే ఫోన్ కాల్ చేశాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు. తీరా హాస్పిటల్‌కు తీసుకెళ్లాక.. చికిత్స చేస్తున్న వైద్యురాలిపై కత్తెరతో దాడి చేశాడు. ఆమె మృతికి కారణమయ్యాడు. ఈ దారుణ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..!
కొల్లాం జిల్లాలోని ఓ ఎయిడెడ్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు నిందితుడు సందీప్. డ్రగ్స్‌కు పూర్తిగా బానిసైన అతడు.. సహాచర ఉపాధ్యాయులను, విద్యార్ధులను ఇబ్బందులు పెట్టడం వల్ల సస్పెండ్ అయ్యాడు. ఇక ఉద్యోగం పోయిన అనంతరం అతడు ప్రతీసారి స్థానికులతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు మంగళవారం తన కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత అతడే స్వయంగా పోలీసులకు సమాచారం అందించి.. తన కాలికి గాయమైందని.. అస్సలు నడవలేకపోతున్నానంటూ పలుమార్లు ఫోన్ కాల్ చేశాడు. వెంటనే అతడి దగ్గరకు చేరుకున్న పోలీసులు.. నిందితుడు సందీప్‌ను కొట్టారక్కరా ఆస్పత్రికి తరలించారు.
అతడ్ని హాస్పిటల్‌కు తీసుకొచ్చిన సమయంలో డాక్టర్ వందనాదాస్(23) డ్యూటీలో ఉంది. నిందితుడికి పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. కాలికి గాయమైనట్లు గుర్తించి, చికిత్స చేయడం ప్రారంభించింది. అప్పుడే నిందితుడు సందీప్ ఒక్కసారిగా రెచ్చిపోయి.. ఆమెపై కత్తెరతో దాడి చేశాడు. వైద్యురాలి ఛాతిపై ఐదుసార్లు పొడిచాడు. దీంతో బాధితురాలిని హుటాహుటిన తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అటు దీనిపై ఐఎంఎఫ్, హైకోర్టు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాయి. కాగా, ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది వ్యవస్థ వైఫల్యామేనని, వైద్యులను రక్షించడంలో పోలీసులు విఫలమయ్యారనడానికి ఇదే నిదర్శనం అని తెలిపింది.

