AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..

సామాన్యంగా ఇంట్లో చిన్న పాము కనిపిస్తేనే గుండె జారినంత పనవుతుంది.. కర్రలు పట్టుకుని ఊరంతా ఏకమవుతాం. కానీ దేశంలోని పలు గ్రామాల్లో పాములు ఇళ్లల్లో తిరుగుతుంటాయి. పిల్లలు వాటితో ఆడుకుంటారు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం విచిత్రమైన ఈ సర్ప గ్రామాల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం..

ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..
Snake Village In India
Krishna S
|

Updated on: May 22, 2026 | 6:46 PM

Share

సాధారణంగా పాము పేరు వినగానే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. చిన్న పాము కనిపిస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ఇంట్లోనే నాగుపాములు స్వేచ్ఛగా తిరుగుతుంటే.. వంటగదిలో, పిల్లల పక్కన సర్పాలు పడగ విప్పి ఆడుతుంటే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే కష్టంగా ఉంది కదా.. కానీ దేశంలోని కొన్ని గ్రామాలలో ఇది మామూలే. పాములను శత్రువులుగా కాకుండా తమ కుటుంబ సభ్యులుగా చూసుకునే అరుదైన సంస్కృతి ఆ గ్రామాల్లో విలసిల్లుతోంది. మానవ ప్రకృతి సహజీవనానికి ప్రతీకగా నిలిచిన ఆ సర్ప గ్రామాల గురించిన ఆసక్తికర విశేషాలు మీకోసం..

మహారాష్ట్రలోని షెత్‌ఫల్

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మోహోల్ తాలూకాలో ఉన్న షెత్‌ఫల్ గ్రామాన్ని భారతదేశపు ప్రధాన పాముల గ్రామంగా పిలుస్తారు. పూణే నగరం నుండి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామంలో దాదాపు 5,000 నుండి 6,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ నాగుపాములు కేవలం అడవుల్లోనో, పొలాల్లోనో ఉండవు. గ్రామ వీధులు, దేవాలయాలు, పాఠశాలలు, చివరకు ఇళ్లలోకి కూడా ఇవి స్వేచ్ఛగా వచ్చి వెళ్తుంటాయి. ఈ ఊరిలో ఇల్లు కట్టుకునేటప్పుడు పాములు వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా పైకప్పులో లేదా గోడల మూలల్లో దేవస్థాన్ లాంటి ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడి పిల్లలు పాములను చూసి ఏడవరు, భయపడరు. చిన్న పిల్లలు సైతం విషసర్పాలతో ఆటలాడుకోవడం ఇక్కడ సర్వసాధారణం. ఈ ప్రాంతంలోని పొడి వాతావరణం భారతీయ నాగుపాములు, వైపర్లు, కొండచిలువలు వంటి సర్పాలు జీవించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

బెంగాల్‌లోని ముషర్రు

మహారాష్ట్ర షెత్‌ఫల్ తరహాలోనే పశ్చిమ బెంగాల్‌లో కూడా ఒక విచిత్రమైన సర్ప గ్రామం ఉంది. బర్ధమాన్ నగరం నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముషర్రు (మసూరీ) గ్రామంలో కూడా మానవ-సర్ప సహజీవన సంప్రదాయం శతాబ్దాలుగా వస్తోంది. ఇక్కడ ప్రధానంగా ఒంటి కన్ను నాగుపాములు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఇళ్లలో తిరుగుతూ ఉంటాయి. ఇక్కడి ప్రజలు ఈ పాములను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో కూడా పాముల పూజల కథలు ఉన్నప్పటికీ, బెంగాల్, మహారాష్ట్రల్లో లాగా అవి మనుషులతో కలిసి సామాన్య జీవితం గడపడం చాలా అరుదు.

కాటు వేయవు.. హాని తలపెట్టవు

అయితే ఇన్ని వేల పాములు తిరుగుతున్నా ఈ గ్రామాల్లో పాము కాట్లు చాలా అరుదుగా జరగడం గమనార్హం. “మనం వాటిని భయపెట్టకుండా, వేధించకుండా గౌరవిస్తే.. అవి కూడా మనకు ఎలాంటి హాని చేయవు” అని స్థానిక గ్రామస్థులు బలంగా నమ్ముతారు. పరస్పర గౌరవం, ప్రేమల వల్లే ఈ అద్భుతం సాధ్యమవుతోందని వారు చెబుతారు. ఇక్కడి ప్రజలు ప్రతి ఏటా నాగపంచమి పండుగను ఎంతో ఉత్సాహంగా, పండుగలా జరుపుకుంటారు.

పర్యాటకులకు హెచ్చరిక..

ఈ వింతను చూడటానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు ఈ గ్రామాలకు తరలివస్తుంటారు. అయితే సందర్శకులు అక్కడి పాములను తాకడం, వాటికి ఇబ్బంది కలిగించడం లేదా ఫోటోల కోసం వేధించడం వంటివి చేయకూడదు. స్థానిక సంప్రదాయాలను, ప్రకృతి నియమాలను తప్పకుండా గౌరవించాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.

Follow Us