Viral: గేదెల షెడ్‌లో నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా…
షెడ్‌లో ఉన్న గేదెలు అదే పనిగా అరుస్తున్నాయి.. తాళ్లు తెంపుకునేందుకు ప్రయత్నిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. దీంతో యజమాని కాస్త కంగారు పడుతూ వెళ్లి చూడగా.. అక్కడ ఓ నాగుపాము కనిపించింది. అతడిని చూడగానే పడగవిప్పింది. దీంతో కాస్త దూరం జరిగిన యజమాని జాగ్రత్తగా పరిశీలించగా.. దాని గుడ్లు కూడా కనపించాయి.

ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లా పీపిలి బ్లాక్ పరిధిలోని సాన్పూర్ గ్రామంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఒక రైతు గేదెల షెడ్‌లో చప్పుళ్లు రావడంతో ఏంటా అని చూడగా.. తల్లి కోబ్రా పాము 13 గుడ్లతో కనిపించడంతో గ్రామస్తులు కంగుతిన్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ టీమ్ తక్షణమే స్పందించి చర్యలు చేపట్టింది.
స్థానిక రెస్క్యూ టీమ్… పాముతో పాటు గుడ్లను సురక్షితంగా షెడ్ నుంచి తొలగించింది. గుడ్లు పరిణితి చెంది పిల్లలుగా మారే వరకు పామును తమ రక్షణలో ఉంచారు. 13 గుడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ ఇంక్యుబేటర్‌లో ఉంచి వాటి అభివృద్ధికి అనుకూల పరిస్థితులను కల్పించారు.
కృత్రిమ గుడ్లను పొదిగించిన ప్రక్రియ పూర్తి కావడంతో వాటి నుంచి పాము పిల్లలు బయటపడ్డాయి. పామ పిల్లల్ని సురక్షితంగా తల్లి పాముతో కలిపి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
వర్షాకాలం పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. చల్లదనం, వర్షాల కారణంగా పాములు ఎక్కువగా బయట కనిపించే అవకాశం ఉంటుందంటున్నారు. ఎవరైనా పాములు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. స్వయంగా వాటిని హ్యాండిల్ చేయడానికి ప్రయత్నించకూడదని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..