Speed Breaker: డెడ్ బాడీకి ప్రాణం పోసిన స్పీడ్ బ్రేకర్..! ఆ తర్వాత జరిగిందిదే
రోడ్లన్నాక వాటిపై స్పీడ్ బ్రేకర్లు ఉండటం షరా మామూలే. గాల్లో కళ్లు పెట్టి వాహనాలు నడిపితే స్పీడ్ బ్రేకర్ల వద్ద బొక్కబోర్లా పడటం ఖాయం. అయితే ఓ అంబులెన్స్ డ్రైవర్ కూడా ఇలాగే స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా వేగంగా వాహనాన్ని పోనిచ్చాడు. దెబ్బకు వాహనం ఎగిరి రోడ్డుపై దబాలున పడింది. ఈ కుదులకు అంబులెన్స్ లో ఉన్న డెడ్ బాడీ ఒక్కసారిగా..
కొల్హాపూర్, జనవరి 3: రోడ్లపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి కూడా. అయితే చనిపోయిన ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వల్ల బతికి బట్టకట్టాడు. అదేంటీ రివర్స్‌లో ఉందే యవ్వారం.. అనుకుంటున్నారా? అయితే ఈ విచిత్ర సంఘటన మీరు తెలుసుకోవాల్సిందే. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో రెండు వారాల క్రిత చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
మహారాష్ట్రలో కొల్హాపూర్ జిల్లాలోని కసాబా–బావడా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్లు ధృవీకరించారు. దీంతో చేసేదిలేక మృతదేహాన్ని తిరిగి సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఓ అంబులెన్సును సిద్ధం చేసుకున్నారు. పాండురంగ మరణ వార్త సొంతూరిలో పాకడంతో వెంటనే బంధువులు, స్నేహితులు ఇంటికి రావడం మొదలెట్టారు. ఇక మృతదేహాన్ని త్వరగా గమ్యస్థానానికి చేర్చాలన్న ఆతృతతో అంబులెన్సుకు డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడిపాడు.
ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న ఓ పెద్ద స్పీడ్‌బ్రేకర్‌ను చూడకుండా అలాగే వేగంగా పోనివ్వడంతో.. అదీకాస్తా అల్లంతదూరం ఎగిరి దభీలున రోడ్డుపై పడింది. ఈ భారీ కుదుపుకు చలనం లేకుండా పడిపోయిన పాండురంగ శరీరంలో ఒక్కసారిగా కదలడం ప్రారంభించింది. అతడి చేతివేళ్లు కదలడం గమనించి పాండురంగ భార్య ఒక్కక్షణం తనకళ్లను తానే నమ్మలేకపోయింది. వెంటనే అంబులెన్సుకు వెనుకకు మళ్లించి మరో ఆస్పత్రికి తరలించగా.. పాండురంగ ప్రాణాలతో ఉన్నాడని వైద్యులు ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు వెంటనే పాండురంగకు యాంజియోప్లాస్టీ చేశారు. పూర్తిగా కోలుకోవడానికి రెండు వారాలు పడుతుందని, ఆ తర్వాత ఇంటికెళ్లొచ్చని చెప్పారు. దీంతో సోమవారం డిశ్చార్జి కావడంతో ఇంటికి వెళ్లిపోయారు. సొంతూరిలోని వారంతా ఈ విషయం తెలిసి నోరెళ్లబెట్టారు.