Video: బిచ్చగాడి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే పరేషాన్ పక్కా..? కేవలం 8 గంటల్లో అన్ని వే..లా..
హరిద్వార్‌లో జరుగుతున్న కవాడ్ మేళాలో ఓ యూట్యూబర్ చేసిన వింత ప్రయోగం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో ఒకటైన కవాడ్ మేళాలో భిక్షాటన చేస్తే ఒక రోజులో ఎంత డబ్బు సంపాదించవచ్చో తెలుసుకునేందుకు యూట్యూబర్ పురుషోత్తమ్ వశిష్ఠ్, అతని స్నేహితుడు సచిన్ వింత ప్రయోగం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

యూట్యూబర్లు చేసిన ఈ ప్రయోగంలో భాగంగా సచిన్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. చిరిగిన దుస్తులు ధరించి, ముఖానికి మట్టి పూసుకుని, చేతిలో చిన్న గిన్నె పట్టుకుని భక్తుల వద్ద డబ్బులు అడిగాడు. అంతేకాకుండా మెడకు యూపీఐ క్యూఆర్ కోడ్‌ను కూడా తగిలించుకున్నాడు. దీంతో కొందరు నగదుకు బదులుగా డిజిటల్ పేమెంట్స్ కూడా చేశారు. మొదట ఈ ప్రయోగం ద్వారా రూ.1000 నుంచి రూ.2000 వరకు వస్తుందని ఇద్దరూ భావించారు. అయితే చివరికి వారి అంచనాలను మించి కేవలం 8 గంటల్లోనే సుమారు రూ.4 వేలు వసూలైంది.
నెలకు రూ. లక్షల్లో ఆదాయం..
ప్రయోగం ప్రారంభమైన తొలి కొన్ని గంటల్లో పెద్దగా డబ్బు రాలేదు. భక్తులను సంప్రదిస్తూ సచిన్ సుమారు రూ.130 మాత్రమే సేకరించాడు. కొందరు డబ్బులు ఇవ్వకుండా ‘నహీ హై బోలా నా’ అంటూ తిరస్కరించారు. మరికొందరు మాత్రం ఆగి డబ్బులు ఇచ్చారు. మేళాలో తిరుగుతున్న సమయంలో సచిన్ పలువురు దుకాణదారులు, వ్యాపారులతోనూ మాట్లాడాడు. ఓ సన్‌గ్లాసెస్ విక్రేత అతడికి ఒక జత కళ్లద్దాలను ఉచితంగా ఇచ్చాడు. దీంతో సరదాగా తనను తాను ‘ప్రొఫెషనల్ భిఖారీ’గా సచిన్ అభివర్ణించాడు. మెడకు వేసుకున్న క్యూఆర్ కోడ్ కూడా ఉపయోగపడింది. దాని ద్వారా సుమారు రూ.40 డిజిటల్‌గా అందుకున్నాడు. ప్రయోగం సందర్భంగా సచిన్ ఓ నిజమైన బిచ్చగాడి పక్కన కూర్చున్నాడు. అతడితో మాట్లాడగా.. తన పేరేమిటో, గతంలో ఎక్కడ నివసించేవాడో కూడా గుర్తులేదని ఆ వ్యక్తి చెప్పినట్లు వీడియోలో వెల్లడించారు.
ప్రయోగం ప్రారంభించి నాలుగు గంటలు పూర్తయ్యేసరికి సచిన్ రూ.800 వరకు సేకరించాడు. ఆ తర్వాత కొందరు డబ్బులు ఇవ్వగా, మరికొన్ని సందర్భాల్లో ఎవరూ ఇవ్వలేదు. కొన్ని చోట్ల భద్రతా సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. వర్షం పడుతున్నప్పటికీ సచిన్ గంటల తరబడి నడుస్తూ భక్తులను డబ్బులు అడిగాడు. దీంతో ప్రయోగం క్రమంగా శారీరకంగా, మానసికంగా అలసటకు గురిచేసింది. సుమారు ఎనిమిది గంటల తర్వాత ప్రయోగాన్ని ముగించిన పురుషోత్తమ్, సచిన్.. మొత్తం రూ.4వేల వరకు సేకరించినట్లు తెలిపారు. ఇదే మొత్తాన్ని ప్రతిరోజూ సంపాదిస్తే నెలకు దాదాపు రూ.1.2 లక్షల వరకు రావచ్చని వారు లెక్కించారు.
A YouTuber, Puroshottam Vashisht, became a beggar for 8 hours at Haridwar’s kawad Mela 2026.
He dressed like a beggar, hung a UPI QR code around his neck and walked around asking devotees for money.
He was abused and treated badly by some.
Others treated him with kindness.… pic.twitter.com/HK9Rds7IKQ
— Pratham (@CapitalLens_) August 19, 2026
‘భిక్షాటన అంత సులభం కాదు’
అయితే ఈ లెక్కలను చూసి భిక్షాటన సులభంగా డబ్బు సంపాదించే మార్గమని భావించవద్దని యూట్యూబర్ స్పష్టం చేశాడు. రోజంతా అపరిచితులను పదేపదే డబ్బులు అడగడం శారీరకంగా, మానసికంగా ఎంతో అలసటకు గురిచేస్తుందని తెలిపాడు. జనాలు భిక్షాటనను సులభమైన ఆదాయ మార్గంగా చూడకుండా.. నిజాయితీగా పనిచేసి సంపాదించాలని వీరు సూచించారు. ఇక వీరి వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు రూ.4వేల ఆదాయం చూసి ఆశ్చర్యపోతే.. మరికొందరు ఈ ప్రయోగాన్ని రోజువారీ భిక్షాటన చేసే వారి జీవితాలకు నేరుగా అన్వయించలేమని పేర్కొన్నారు. భిక్షాటన ద్వారా వచ్చే ఆదాయం ప్రతిరోజూ ఒకేలా ఉండదని, కొన్నిసార్లు ఎక్కువగా రావచ్చని, మరికొన్ని రోజుల్లో ఏమీ రాకపోవచ్చని ఓ యూజర్ పేర్కొన్నాడు. అలాగే భిక్షాటనలో ఎదురయ్యే ప్రమాదాలు, అసురక్షిత పరిస్థితులు, దోపిడీ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కొందరు మాత్రం ఈ ప్రయోగం జనాల్లో ‘సులభంగా డబ్బు సంపాదించవచ్చు’ అనే తప్పుడు ఆలోచనకు దారితీయవచ్చని, ఇలాంటివి జనాల్లోకి తీసుకెళ్లకపోవడమే మంచిదని హితవు పలికారు. ఇంతకీ భిక్షాటనపై మీ అభిప్రాయం ఏమిటీ..?




