నలుగురితో తాత రొమాంటిక్ చాట్.. ఒకరి తర్వాత ఒకరు చేసిన పనికి ఆస్పత్రి పాలు..
తియ్యని మాటలు, కమ్మని మెస్సేజ్‌లతో కవ్విస్తారు. నమ్మితే సర్వం దోచేస్తారు. తీరా డబ్బు మొత్తం స్వాహా అయ్యాక గానీ తెలీదు.. వాళ్లు చేసింది మోసం అని.. తాజాగా ముంబైలో ఇటువంటి ఘటనే జరిగింది. హనీట్రాప్‌లో చిక్కుకుని 80 ఏళ్ల వృద్ధుడు రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు.

హనీ ట్రాప్.. దీనికి చిక్కని వారెవరు. గూఢచారుల నుంచి మొదలు వృద్ధుల వరకు దీన్ని బాధితులే. వలపు వలతో దేశాల రహస్యాలు సైతం బయటపడ్డాయి. దేనికి లొంగని వ్యక్తి కూడా ఈ వలపు వలలో చిక్కుకుని చివరకు విలవిలలాడతారు. ఇప్పటికే ఎంతో మంది దీనికి చిక్కి కోట్లు పోగొట్టుకున్నారు. ఈ మధ్య ఎక్కువగా వృద్ధులు హనీట్రాప్‌కు చిక్కడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా 80ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్ చేసి రూ.9కోట్లు దోచుకున్నారు. ముంబైలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. షార్వీ, కవిత, దినాజ్, జాస్మిన్ అంటూ రకరకాల పేర్లతో ఆ వృద్ధుడికి మాయమాటలు చెప్పి డబ్బు కాజేశారు. చివరకు మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి లబోదిబోమంటున్నాడు.
రెండేళ్ల క్రితం ఆ వృద్ధుడికి షార్వీ అనే మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. భర్త నుంచి విడిపోయి, పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నట్లు వృద్ధుడికి మాయమాటలు చెప్పింది. అది నిజమేనని అతడు నమ్మాడు. మెల్లిగా పిల్లల వైద్యం, చదవు పేరుతో అతడిని నుంచి పలుసార్లు డబ్బు నొక్కేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు షార్వీ ఫ్రెండ్ కవిత అంటూ లైన్‌లోకి వచ్చింది. సేమ్ ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ అంటూ కవ్వించి ఆ తర్వాత తన అవసరాలను చెప్పి మళ్లీ డబ్బు కాజేసింది. మరికొన్ని రోజులకు షార్వీ చనిపోయిందని.. తాను ఆమె సిస్టర్ దినాజ్ అంటూ మళ్లీ వృద్ధుడి ఇంకో మెస్సేజ్ వచ్చింది. ఆస్పత్రిలో బిల్లులు కట్టాలని.. డబ్బు ఇవ్వకపోతే తాను చనిపోతానని బెదిరించి మళ్లీ డబ్బు స్వాహా చేశారు. అంతటితో ఆగకుండా దినాజ్ ఫ్రెండ్ జాస్మిన్ అంటూ మరోసారి ఆ వృద్ధుడిని ట్రాప్ చేశారు.
ఇలా నలుగురి పేర్లతో ఆ వృద్ధుడు నుంచి రూ.9 కోట్లు కాజేశారు. మొత్తం 734 లావాదేవీల ద్వారా వృద్ధుడు రూ.9కోట్లు పంపించాడు. తన వద్ద దాచుకున్న డబ్బు అయిపోయినా.. వేరే వాళ్ల దగ్గర అప్పు తీసుకుని మరీ పంపించడం గమనార్హం. కుటుంబసభ్యులు డబ్బుల విషయం గురించి పలుమార్లు ప్రశ్నించినా.. ఎంతకు చెప్పకపోవడంతో ఏం జరిగిందని ఆరా తీశారు. చివరకు జరిగింది తెలుసుకుని అవాక్కయ్యారు. ఇదంతా సైబర్ మోసం అని తెలిసి వృద్దుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఆయనకు డిమెన్షియా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
