Andhra Pradesh: రోడ్డు పక్కన ఆగిన కారు.. డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్.!
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని జమ్ము జంక్షన్ వద్ద ఆగి ఉన్న కారులో భారీగా గంజాయిని పోలీసులు గుర్తించారు...

గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. గంజాయి కనిపిస్తే చాలు కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీనితో పోలీసులు ప్రతీ చెక్ పోస్ట్ దగ్గర ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని జమ్ము జంక్షన్ వద్ద ఆగి ఉన్న కారులో భారీగా గంజాయిని పోలీసులు గుర్తించారు. ఒడిశాలోని పర్లాకిమిడి వైపు నుంచి నరసన్నపేటకు వస్తున్న కారులో కేటుగాళ్లు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. జమ్ము కూడలి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండటం గమనించిన నిందితులు…కారును అక్కడే వదిలేసి పారిపోయారు. రోడ్డు పక్కగా నిలిపివున్న కారుపై అనుమానం వచ్చిన పోలీసులు..కార్ డోర్ ఓపెన్ చేసి చూడగా.. పెద్ద ఎత్తున గంజాయి దొరికింది. కారుతో సహా గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
