రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కల్తీ ఆహారం.. రూ. 10 లక్షల జరిమానా!
రైలు ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో నిర్లక్ష్యానికి గానూ రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంది. ప్రసిద్ధ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ బేస్ కిచెన్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు నిరూపితం కావడంతో ఐఆర్‌సిటిసి సదరు కాంట్రాక్టర్‌కు రూ. 10 లక్షల భారీ జరిమానా విధించింది.

రైలు ప్రయాణికులకు అందించే ఆహార నాణ్యతపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన తనిఖీలను తీవ్రతరం చేసింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మార్గంలో నడిచే స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఆహారం తయారుచేసే బేస్ కిచెన్‌లో ఐఆర్‌సిటిసి అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల సమయంలో కిచెన్ ఆవరణలో గడువు ముగిసిన ఆహార పదార్థాల ప్యాకెట్లు, నాసిరకం దినుసులు లభ్యమవడంతో అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రయాణికుల ఆరోగ్యంపై ప్రభావం చూపేలా ఉన్న ఈ పరిస్థితిని చూసి అధికారులు వెంటనే చర్యలకు దిగారు.
ప్రీమియం రైళ్లుగా భావించే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లలో ఆహార నాణ్యత విషయంలో రాజీపడేది లేదని ఐఆర్‌సిటిసి స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు క్యాటరింగ్ కాంట్రాక్టర్‌కు రూ. 10 లక్షల ఫైన్ విధించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. రైల్వే బేస్ కిచెన్‌లలో పరిశుభ్రత, ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
రైళ్లలో అందించే క్యాటరింగ్ సేవలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఐఆర్‌సిటిసి ఇంత వేగంగా స్పందించి భారీ జరిమానా విధించడాన్ని ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. ఆహార నాణ్యతలో ఏమాత్రం తేడా ఉన్నా ఐఆర్‌సిటిసి యాప్ లేదా రైల్ మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.




