
ఏమైందో ఏమోగానీ కోతులు గుంపుగా ఒక దానిపై ఒకటి దాడి చేసుకున్నాయి..ఒక్కసారిగా జరిగిన ఈ దాడిలో ఒక కోతి గాయపడింది. తీవ్ర రక్తస్రావంతో ఆ కోతి తల్లడిల్లిపోయింది. నడవలేక, కదల్లేని స్థితిలో అల్లాడిపోయింది. అది గమనించిన ఓ కానిస్టేబుల్ మానవత్వం తో స్పందించారు. కోతుల దాడిలో గాయపడ్డ వానరానికి వైద్య చికిత్సలు చేయించి తిరిగి కోలుకునేలా చేశాడు కానిస్టేబుల్ తేజావత్ నరేష్. ఈ ఘటనతో కానిస్టేబుల్‌పై ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఖమ్మం జిల్లా తల్లాడ పోలీస్ స్టేషన్ సమీపంలో కోతులు గుంపుగా ఏర్పడి ఒకదానిపై మరొకటి దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక వానరానికి తీవ్ర గాయాలు కావటంతో రక్తం కారిపోతూ కనిపించింది..గాయపడిన కోతిని చూసిన తల్లాడ పోలీస్ కానిస్టేబుల్ తేజావత్ నరేష్ వెంటనే స్పందించాడు. గాయపడిన వానరానికి వైద్య చికిత్సలు చేయించారు. రెండు చేతులతో వానరాన్ని ఎత్తుకొని దానికి వైద్యం అందేలా చేశారు.
రక్తం బయటకు రాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో పరికరాల ద్వారా కట్టు గట్టి రక్తస్రావం జరగకుండా కాపాడారు. అనంతరం వానరానికి పండ్లు, ఫలాలు ఆయనే స్వయంగా తినిపించారు. దీంతో యధావిధిగా వానరం తన దారిన తాను వెళ్ళిపోయింది. వానరానికి సపర్యలు చేసిన కానిస్టేబుల్ నరేష్ ను పలువురు అభినందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..