AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

రూ.10.9 కోట్ల జాక్‌పాట్ తగిలిందన్న సంతోషం క్షణాల్లో ఆవిరైపోయింది. కొట్టుకొచ్చిన అదృష్టాన్ని పొరపాటున చెత్తబుట్టలో పారేసిందో మహిళ. కానీ కథ అక్కడ ముగిసిపోలేదు.. ఆ క్షణమే ఒక అసలుసిసలైన సినిమా డ్రామా మొదలైంది. ఏకంగా రెండు రోజుల పాటు వెతుకులాట తర్వాత అసలు ఏం జరిగింది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Italian Woman Lottery Winning Ticket Thrown In Trash
Krishna S
|

Updated on: Aug 06, 2026 | 10:03 AM

Share

అదృష్టం తలుపు తట్టినా, చిన్న పొరపాటుతో అది చెత్తబుట్ట పాలైతే ఆ బాధ మామూలుగా ఉండదు. సరిగ్గా అలాంటి విచిత్ర సంఘటనే ఇటలీలో జరిగింది. చేతికి వచ్చిన రూ.10.9 కోట్ల లాటరీ టికెట్‌ను ఒక మహిళ పొరపాటున చెత్తలో పారేసింది. కానీ మున్సిపల్ చెత్త సిబ్బంది పడిన శ్రమతో ఆ టికెట్ తిరిగి దక్కడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దక్షిణ ఇటలీలోని బిటోంటో నగరానికి చెందిన ఒక మహిళ క్రమం తప్పకుండా 2, 4, 8, 10, 51 అనే సంఖ్యలతో లాటరీ టికెట్ కొనుగోలు చేసేది. తనకు అత్యంత ఆత్మీయుడైన ఒకరి గుర్తుగా ఆమె ఎప్పుడూ ఈ సంఖ్యలనే ఎంచుకునేది. ఇటీవల లాటరీ డ్రా ముగిసిన తర్వాత ఫలితాలు సరిచూసుకోవడానికి ఒక స్థానిక దుకాణానికి వెళ్లింది. అక్కడి మిషన్‌లో టికెట్ చెక్ చేయగా నాన్-పేయబుల్ అని వచ్చింది. లాటరీ గెలుచుకున్న బహుమతి మొత్తం చాలా పెద్దదిగా ఉన్నప్పుడు షాపుల్లో డబ్బులు ఇవ్వడం సాధ్యపడక మిషన్ అలా చూపుతుంది. కానీ ఆ మహిళ టికెట్ చెల్లదని భావించి, దానిని అక్కడే ఉన్న చెత్తబుట్టలో పారేసి ఇంటికి వెళ్లిపోయింది.

కుటుంబ సభ్యుడి సమాచారంతో షాక్

ఇంటికి తిరిగి వచ్చాక కుటుంబ సభ్యులలో ఒకరు ఆమె రెగ్యులర్ నంబర్లకే రూ.10.9 కోట్ల జాక్‌పాట్ తగిలిందని చెప్పారు. దీంతో షాక్‌కు గురైన ఆ మహిళ వెంటనే పరుగుపరుగున దుకాణానికి వెళ్లింది. కానీ అప్పటికే ఆ షాప్‌లోని చెత్తను మున్సిపాలిటీ గార్బేజ్ ట్రక్ తీసుకెళ్లిపోయింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ఆ మహిళ కుటుంబం స్థానిక వ్యర్థాల నిర్వహణ సంస్థ అడ్మినిస్ట్రేటర్ రోబెర్టో నికోలా తోస్కానోను ఆశ్రయించింది. ‘‘టికెట్ దొరుకుతుందనే ఆశ లేకుండానే, ఆ గార్బేజ్ ట్రక్ వెళ్లిన రూట్‌ను ట్రాక్ చేశాం’’ అని తోస్కానో తెలిపారు.

అద్భుతం..

ఆ అదృష్టవశాత్తూ, సరైన చెత్త ట్రక్‌ను గుర్తించి వారు దాన్ని వెంటనే నిలిపివేశారు. చెత్తలో ప్రమాదకర వ్యర్థాలు ఉండే అవకాశం ఉండటంతో, ప్రత్యేక పరికరాలు ఉన్న ఒక సంస్థకు ఆ వాహనాన్ని తరలించారు. అక్కడి కార్మికులు ఏకంగా ఒక రోజు కంటే ఎక్కువ సమయం పాటు టన్నుల కొద్దీ చెత్తను జల్లెడ పట్టారు. ఎట్టకేలకు ఒక అద్భుతంలా చిరిగిపోకుండా భద్రంగా ఉన్న ఆ అదృష్ట టికెట్ వారికి దొరికింది.

ఫోన్‌లోనే భావోద్వేగానికి గురైన మహిళ

టికెట్ దొరికిందనే విషయాన్ని తోస్కానో ఫోన్ చేసి చెప్పగానే ఆ మహిళ ఆనందంతో ఏడ్చేసింది. ‘‘ఆ క్షణంలో ఆమె అక్కడ ఉంటే గట్టిగా కౌగిలించుకునేవాడిని.. కానీ మేము ఫోన్‌లో ఉన్నాం’’ అని తోస్కానో భావోద్వేగంతో చెప్పారు. అయితే SANB అనేది ప్రభుత్వ సంస్థ కావడంతో ఆ టికెట్ కోసం చేసిన శోధన ఆపరేషన్‌కు అయిన అదనపు ఖర్చులను సదరు మహిళే భరించాలనే ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా కొన్ని వేల రూపాయల ఖర్చుతో రూ.10.9 కోట్ల జాక్‌పాట్ దక్కడంతో ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది.

Follow Us