శరీరంలో చెడు కొవ్వు మంచులా కరిగిపోవాలంటే దానిమ్మను ఎలా తీసుకోవాలో తెలుసా..?
మీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయా? ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా గుండెను కాపాడుకోవాలనుకుంటున్నారా? అయితే దానిమ్మపండును మీ ఆహారంలో చేర్చుకోవాల్సిందే. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఇది ఎలా అడ్డుకుంటుంది? జ్యూస్ తాగడం కంటే గింజలను నమిలి తినడం ఎందుకు మేలనే విషయాలపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మోసిన్ వాలి వెల్లడించిన ఆసక్తికర వాస్తవాలు ఇవీ..

నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా యువతలోనూ అధిక కొలెస్ట్రాల్ సమస్య వేగంగా పెరుగుతోంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు పూడుకుపోయి గుండె జబ్బులు, ఆకస్మిక గుండెపోటు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అయితే నిత్యం దానిమ్మపండు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందా? గుండె ఆరోగ్యానికి జ్యూస్ మంచిదా లేక గింజలను నమిలి తినడం మేలా? ప్రముఖ కార్డియాలజీ నిపుణులు ప్రొఫెసర్ మోసిన్ వాలి దీనికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
చెడు కొలెస్ట్రాల్‌ను దానిమ్మ ఎలా అడ్డుకుంటుంది?
దానిమ్మలో పునికలాగిన్స్, ఆంథోసయనిన్స్, ఎలాజిక్ యాసిడ్ వంటి అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పరిశోధన ప్రకారం.. దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చెందకుండా అడ్డుకుంటాయి. ఆక్సీకరణ జరగకపోతే కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలపై పాచిలా పేరుకుపోదు. నిత్యం దానిమ్మ తీసుకోవడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తనాళాలను రక్షించి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
జ్యూస్ తాగడమా.. పండు నమలడమా? ఏది బెస్ట్?
దానిమ్మ రసం తాగడం కంటే గింజలను పూర్తిగా నమిలి తినడమే శరీరానికి అత్యంత ప్రయోజనకరమని డాక్టర్ వాలి స్పష్టం చేశారు. పండును నేరుగా తినడం వల్ల సహజసిద్ధమైన పీచు పదార్థం శరీరానికి అందుతుంది. జ్యూస్ తీసినప్పుడు ఫైబర్ తొలగిపోవడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పళ్ళు ఉన్నంత వరకు గింజలను నమిలి తినడమే ఉత్తమమైన మార్గం.
ప్రతిరోజూ ఎంత తినాలి? మందులకు ప్రత్యామ్నాయమా?
కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు రోజూ ఒక మోస్తరు దానిమ్మపండు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇది కొలెస్ట్రాల్ నివారణ మందులకు ప్రత్యామ్నాయం కాదని, చికిత్సకు అనుబంధంగా సహాయపడే మంచి ఆహారం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ విషయానికొస్తే.. మైదా, అధిక కార్బోహైడ్రేట్లు, ఆల్కహాల్ వంటి వాటి వల్లే అవి పెరుగుతాయి. ట్రైగ్లిజరైడ్స్‌పై దానిమ్మ ప్రత్యక్ష ప్రభావం ఇంకా శాస్త్రీయంగా నిరూపితం కానప్పటికీ, జీర్ణవ్యవస్థ, పేగుల్లోని మంచి బ్యాక్టీరియా మరియు మానసిక ఆరోగ్యానికి దానిమ్మ ఎంతో మేలు చేస్తుంది.
యువతకు డాక్టర్ 6/1 ఫార్ములా.. ఇంట్లోనే హెల్తీ పిజ్జా..
కొలెస్ట్రాల్ పెరిగిన తర్వాత కంగారు పడటం కంటే ప్రారంభం నుంచే అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
6/1 రూల్: వారంలో 6 రోజులు ఇంట్లో వండిన పోషకమైన సమతుల్య భోజనం తీసుకోవాలి. కేవలం ఒక్క రోజు మాత్రమే పరిమిత పరిమాణంలో ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ తీసుకోవాలి.
హెల్తీ ఫాస్ట్ ఫుడ్: బయట పిజ్జా, బర్గర్లు కొనే బదులు ఇంట్లోనే గోధుమ పిండి, తృణధాన్యాల బేస్‌తో, ఎక్కువ కూరగాయలు జోడించి ఆరోగ్యకరంగా పిజ్జా తయారు చేసుకోవచ్చు.
ముందస్తు పరీక్షలు: యువత క్రమం తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకుంటూ, వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
